BRS Attack Congress | కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ చతుర్ముఖ వ్యూహం!

BRS Attack Congress | కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ చతుర్ముఖ వ్యూహం!
  • కేటీఆర్, హరీష్, కవిత త్రయం ఒకవైపు..
  • ‘పింక్’సోషల్ మీడియా సైన్యం మరోవైపు
  • తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే యత్నం

BRS Attack Congress | పదేళ్లు అధికారంలోకి ఉండి.. అమలు చేసిన పథకాలు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘బంధు’ పథకాలు తమకు గెలుపు సోపానాలు అనుకుంది బీఆర్ఎస్ నాయకత్వం. ఎన్నికల్లో ప్రతిపక్షాల కట్టడికి ఫోన్ ట్యాపింగ్‌తో చేసిన దిగ్భంధం చేశారన్న అరోపణలూ వచ్చాయి. మొత్తంగా తెలంగాణలో మరోసారి తమదే అధికారమన్న ధీమా చూపారు. అయితే ప్రశ్నించే నైజం.. అణచి వేతపై తిరుగుబాటు తత్వం.. స్వేచ్ఛనే శ్వాసగా భావించే తెలంగాణ సమాజం మాత్రం కల్వకుంట్ల కుటుంబం పద్మవ్యూహాలను ఛేదించి, బీఆర్ఎస్ ను ఓడించి, దిమ్మ దిరిగే తీర్పుతో ప్రగతి భవన్ నుంచి ఫామ్‌హౌస్ బాట పట్టించారు. స్వతంత్ర భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిర్భంధాలు, కుట్రలు, జనాకర్షక ఎత్తుగడలకు ఎన్నికల సమరంలో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ప్రజాస్వామిక విప్లవాలన్నింటిలోనూ విలక్షణమైనదిగా రాజకీయ పరిశీలకులు అప్పట్లోనే అభివర్ణించారు. ప్రజాతీర్పును విశ్లేషించుకుని సరికొత్త విధానాలతో జనాభిమానం కోసం ప్రయత్నించాల్సిన బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం నిత్యం ఏదో రూపంలో ప్రజలే తమను తిరస్కరించి తప్పు చేసినట్లుగా అసహనం వెళ్లగక్కుతుండటం గమనార్హం. ఈ క్రమంలో అధికారం కోల్పోయిన మొదటి నుంచే అధికార కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ ప్రగతి భవన్ పాలన కాలమంతా తెలంగాణ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి యుగమనట్లుగా.. కాంగ్రెస్ పాలనంతా అవినీతి, అక్రమాలు, అణచివేతల మయమంటూ నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆ ముగ్గురే..

అధికారంలో ఉన్న మాదిరిగానే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత.. ప్రభుత్వంపై విమర్శల దాడిలో చట్టసభలలోనూ.. బయట కూడా కనిపిస్తున్నారు. అడపదడపా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉనికి కోసమన్నట్లుగా ప్రెస్ మీట్ పెడుతున్నారు. పార్టీలో ఆధిపత్య పోరును తలపించేలా.. ఏకంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మరిపించేలా నిత్యం కేటీఆర్, హరీష్ రావు, కవితలు కుదిరితే ప్రెస్ మీట్‌లలో.. లేకపోతే ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై పోటీపడి విమర్శలు కురిపిస్తున్నారు. వారు ముగ్గురితో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా అటాక్ మరోవైపు నిత్యం కొనసాగుతునే ఉంది. ప్రభుత్వం ఎప్పుడు ఏ తప్పటడుగు వేస్తుందో చూస్తూ వారంతా నలువైపులా విమర్శల దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి రైతాంగ సమస్యలపై కేటీఆర్, కవిత, హరీష్ రావులు ఎక్స్ వేదికగా విమర్శలు సంధించారు. కాంగ్రెస్ సర్కార్ పై నిత్యం విమర్శలతో విరుచకపడుతున్న ఆ ముగ్గురి తీరు చూస్తే ఇప్పటికిప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చేయాలన్న తాపత్రాయం కనిపిస్తుందని..కాకపోతే వారి ఆత్రం..ఆరాటం..జనానికి కూడా ఉందని వారు భ్రమపడుతున్నారని విపక్షాలు సైటర్లు సంధిస్తున్నాయి.

ఇది నో స్టాక్ సర్కార్ : కవిత

రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై కేటీఆర్, కవిత, హరీష్ రావులు ఎక్స్ వేదికగా విమర్శలు సంధించారు. కవిత తన ఎక్స్ ఖాతాలో ఇది నో స్టాక్ సర్కారు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాజుగా బతికిన రైతును కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రోడ్డు పాలు చేసిందన్నారు. పోలీస్ స్టేషన్లలో ఎరువులు, విత్తనాలు అమ్మిన చరిత్రను రిపీట్ చేసిందని..ఇప్పుడు ఎక్కడ చూసినా యూరియా కోసం భారీ క్యూ లైన్లే కనిపిస్తున్నాయని విమర్శించారు. యూరియా మాత్రమే కాదు డీఏపీ, పొటాష్ కోసమూ రైతులకు తిప్పలు పడుతున్నారని.. ముగ్గురు మంత్రులున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి మరీ ఘోరం అన్నారు. వానాకాలం సీజన్ మొదలై నెల రోజులు గడిచిన తర్వాత కూడా ఎరువుల కొరత రైతులను వేధిస్తున్నది అంటే సర్కారు ముందు చూపులేని తనం ప్రణాళికబద్ధంగా వ్యవహరించకపోవడమే కారణం అని ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఎరువుల కరువు : కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదని..కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. మీరు అడిగినట్టు ఆధార్ కార్డులు ఇచ్చినా, రైతుకి కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకుందని రైతులకు వివరించాలన్నారు కేటీఆర్. రూ.266.50 ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు రూ.325 ఎలా అయ్యిందో రైతులకే కాదు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియలన్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తుంది ఎవరు?..ఈ కృత్రిమ కొరత ఎవరివల్ల ఏర్పడుతుందో, ఆఖరికి ఎరువులను కూడా బుక్కేస్తున్న మేతన్నలు ఎవరో వెంటనే విచారణ జరిపించాలన్నారు.

కేసీఆర్ పాలనే రైతన్నకు భరోసా: హరీష్ రావు

కేసీఆర్ పదేళ్ల పాలనే రైతాంగానికి భరోసా కాలమని..వ్యవసాయం పండగలా మారిందని మాజీ మంత్రి టి.హరీష్ రావు ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. పదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు సాయం, రైతు రుణమాఫీ, యూరియా, నాణ్యమైన విత్తనాల సరఫరా, రైతువేదికల నిర్మాణం, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం వంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెరిగిన భూగర్భ జలాలు.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరాతో పాటు రైతు కుటంబాల సభ్యులకు అందిన సంక్షేమ పథకాలతో రైతులకు మేలు జరిగిందని వివరించారు.