Hidma Encounter: End of India’s Most Lethal Maoist Commander. Who is Madvi Hidma?
(విధాత ప్రత్యేకం)
హైదరాబాద్, నవంబర్ 18:
Hidma Encounter | అమిత్ షా పట్టుదల నెరవేరింది. అందని నీడలా రెండు దశాబ్దాలుగా భద్రతా వ్యవస్థలను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన మావోయిస్ట్ టాప్ కమాండర్ మద్వి హిడ్మా అంతమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ నిర్వహించిన తెల్లవారుజాము ఆపరేషన్‌లో హిడ్మా, అతని భార్య రాజక్కతో పాటు నలుగురు మావోయిస్టులు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌ను భద్రతా వర్గాలు “దశాబ్దాల అరుణ విప్లవ నిర్మూలనలో అతిపెద్ద పురోగతి”గా పేర్కొన్నాయి.
1981లో సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో జన్మించిన హిడ్మా (అ.కా. దేవా/హిడ్మాలు) చిన్న వయసులోనే మావోయిస్టుల మధ్య పెరిగాడు. 10వ తరగతి తర్వాత ఆర్గనైజేషన్‌లో చేరి, రెండు దశాబ్దాల్లోనే PLGA(Peoples Liberation Guerrilla Army) బెటాలియన్‌కు కమాండర్‌గా ఎదిగాడు. బస్తర్‌కు చెందిన ఏకైక గిరిజన సభ్యుడిగా సెంట్రల్ కమిటీ స్థాయికి చేరడం అతని శక్తియుక్తులను సూచిస్తోంది.
హిడ్మా – కరుడుగట్టిన కార్యకర్త నుంచి మావోయిస్టుల మేధస్సుగా ఎదుగుదల
హిడ్మా ఎదుగుదలకు కీలకంగా సహకరించినవి అతని కఠినమైన అనుశాసనం, యుద్ధ నైపుణ్యం, అటవీ భూభాగం మీద పూర్తి పట్టు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు లేవడమో, వార్తలు చదవడమో, భారీ పరుగులు, బెటాలియన్ ట్రైనింగ్ వంటివి అతను కఠినంగా పాటించేవాడు. తన దగ్గర పనిచేసిన చాలామంది “అతను కఠినాత్ముడు, కానీ ముందుండి నడిపించే నాయకుడు” అని చెబుతారు. అబూజ్మడ్ సొరంగాల్లాంటి అటవీ ప్రాంతాల్లో అతని నెట్‌వర్క్ చాలా బలంగా ఉండేది. భద్రతా దళాలు అడుగు పెట్టడానికి కొన్ని గంటల ముందే అతనికి సమాచారం అందేది. అతని భద్రతావలయం గురించి మాజీ మావోయిస్టులు చెప్పే ఒకే మాట, “ఒక రాష్ట్ర డిజిపి కంటే ఎక్కువ సెక్యూరిటీ హిడ్మాకు ఉండేది.”
ALSO READ : మావోయిస్టు అగ్రనాయకుడు హిడ్మా హతం
అతను నేతృత్వం వహించిన బెటాలియన్ చరిత్రలో 26కి పైగా పెద్ద దాడులకు కారణమైంది:
- 2010 దంతేవాడా హత్యాకాండ (76 మంది CRPF జవాన్లు)
- 2013 జిరమ్ ఘాటి అంబుష్ (చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది)
- 2017 సుక్మా ట్విన్ అటాక్స్
- 2021 సుక్మా-బీజాపూర్ ఎర (22 మంది)
జాతీయ భద్రతాసంస్థలు అతని మీద రూ. 1 కోటి వరకూ రివార్డ్ ప్రకటించాయి. ఈ సంవత్సరమే అతను కర్రెగుట్టల ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నాడని నిఘాసంస్థలు చెబుతున్నాయి.
హిడ్మా అంతం.. మావోయిస్టు ఉద్యమానికి ‘ఎండ్ గేమ్’?
గ్రేహౌండ్స్ ఆపరేషన్ విజయవంతమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ DGP హరీష్ కుమార్ గుప్తా దీనిని “మావోయిస్టు ఉద్యమం తల నరికినట్టే” అని వ్యాఖ్యానించారు. హిడ్మా మరణంతో దండకారణ్యలోని మావోయిస్టు కమాండ్ నిర్మాణం పూర్తిగా కూలిపోయిందని ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి రెండు సంవత్సరాల్లో కేంద్రం అమలు చేస్తున్న Mission 2026, ఆపరేషన్ ప్రహార్, సమాధాన్–ప్రహార్, ఆపరేషన్ కగార్ వంటివి మావోయిస్టుల బలగాలను అడవి అంతర్భాగాలకే పరిమితం చేశాయి. ఇదే సమయంలో 1,500 కి.మీ.కుపైగా రోడ్లు, 200 మొబైల్ టవర్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం తిరిగి నిర్మించింది.
అంతేకాకుండా —
- CPI (Maoist) సెంట్రల్ కమిటీ సభ్యులు 42 నుండి 12 మందికి పడిపోయారు
- 2025 లోనే 5 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లలో మరణించారు.
- కీలక నాయకులు లొంగిపోయారు
హిడ్మా మాత్రం “సైన్య పునర్నిర్మాణం” కోసం పార్టీ ఆశలు పెట్టుకున్న నాయకుడు. అతను కూడా నేడు నేలకొరగడంతో, బస్తర్–సుక్మా ప్రాంతంలో నాయకత్వలేమితో పాటు, ఉద్యమం కూడా అస్తమించే సమయం ఆసన్నమైందనే అంచనా మరింత బలపడింది.
