Telangana Cabinet Expansion | స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ జరగనున్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విస్తరణకు ముందే బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు కుటుంబంతో పాటు మరో ఐదారుగురు మినహా అందరూ కాంగ్రెస్‌లో చేరనున్నారని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ఉన్నారని, స్థానికం తరువాత కార్యాచరణలోకి దిగుతారని ఆ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 90 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. చట్టపరంగానే బీసీ రిజర్వేషన్లను పెంచనున్నారు. పంచాయతీ ఎన్నికలను మూడు నెలల వ్యవధి అనగా సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయనున్నారు. ఒక నెల రోజుల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌ల రిజర్వేషన్లను ఖరారు చేసి, రెండు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు షెడ్యులు ఖరారు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే సన్నద్ధతగా పనిచేయాలని మూడు రోజుల క్రితం గాంధీ భవన్‌లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్.. పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు వస్తాయని, పని చేయని వారికి ఏ విధమైన పోస్టులూ దక్కవని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తాను రెండు జాబితాలను ఇక నుంచి తయారు చేసుకుంటానని, ఒకటి పార్టీ కోసం పనిచేసే వారి పేర్లతో, రెండోది పనిచేయని నాయకుల పేర్లతో మరో జాబితా సిద్ధం చేసుకుంటానని అన్నారు. ఎప్పటికప్పుడు ఇందులో మార్పులు చేర్పులు చేసుకుంటానని తెలిపారు. ఇలాంటి నాయకులపై నిఘా ఉంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరిచారు. సెప్టెంబర్ తరువాత పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ఓటములను సమీక్షించుకుని, జిల్లాల వారీగా మంత్రుల పనితీరును రాష్ట్ర నాయకత్వం అంచనా వేయనున్నది. అధికార పార్టీ ఎన్ని కైవసం చేసుకున్నది, ప్రతిపక్ష పార్టీలకు దక్కిన స్థానాలు ఎన్ని అనే దానిపై సూక్ష్మస్థాయిలో సమీక్ష చేసుకోనున్నారు.
ఎన్నికల తరువాత భారీ చేరికలు?
స్థానిక సంస్థల ఎన్నికల తరువాత కాంగ్రెస్‌లోకి భారీ ఎత్తున చేరికలు జరగనున్నాయని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలను కైవసం చేసుకోగా, వారిలో తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఇటీవలే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో మరో సీటు ఖాళీ అయ్యింది. దీంతో బీఆర్ఎస్ సంఖ్య 28కి పడిపోయింది. ఈ సంఖ్యలో 18కి తగ్గకుండా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా ఉండేందుకు కేసీఆర్ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ సభ్యులను చేర్చుకుని చావుదెబ్బ తీశారు. సభలో 18 మంది సభ్యులు ఉండగా, 12 మందిని చేర్చుకుని ఆరుగురికే పరిమితం చేసిన విషయం విదితమే. ఈ ఆరుగురు సభ్యులకు ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడిగా వ్యవహరించారు. ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించేలా కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారు. అదే తరహాలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా వ్యూహం సిద్ధం చేసి పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పెద్దలు కూడా రేవంత్ ప్రణాళికకు ఆమోదముద్ర వేశారని అంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ పది లోపు సభ్యులకే పరిమితం కావచ్చని అంటున్నారు. ఈ చేరికలు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఉండవచ్చని పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు. అనర్హత పిటిషన్‌పై తీర్పు వచ్చేలోగానే ఈ కసరత్తు పూర్తి చేయాలనే గట్టి పట్టుదలతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. కొత్తగా చేరే వారిలో కొందరికి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశ చూపినట్లు తెలిసింది.
ముగ్గురు మంత్రులు ఔట్, ఆరుగురికి అవకాశం!
ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గంలో 15 మంది ఉండగా, మరో మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కుల సమీకరణలు సమకూరకపోవడంతో మరో మూడు ఖాళీలను భర్తీ చేయలేదు. స్థానిక ఎన్నికలలో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును పరిగణనలోకి తీసుకుని, సమర్థంగా పనిచేసిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి మాటలను బట్టి అర్థమవుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ముగియనున్నది. ఆ లోపే అనగా ఈ ఏడాది చివరి కల్లా మంత్రి వర్గ విస్తరణ చేయనున్నారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్నవారిలో ముగ్గురు లేదా నలుగురిని తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఖాళీలు మూడు ఉండనే ఉన్నాయి. మొత్తం ఆరు లేదా ఏడు మంత్రి పదవులను పార్టీలో కొత్తగా చేరేవారితో పాటు, ఆశావహులతో భర్తీ చేయనున్నారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి మూడు వరకు మంత్రి పదవులు దక్కవచ్చని చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి బీఆర్ఎస్ నుంచి చేరిన వారికే పదవులు ఇవ్వనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నందున ఈ రెండు జిల్లాల నుంచి బీసీలనే మంత్రులు చేయాలని నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రతిపాదన ఇలా ఉన్నా, స్థానిక ఎన్నికల తరువాత మార్పులు చేర్పులు ఉండవచ్చని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Tejeshwar murder | మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితో! తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు
Pushpa 2 Showed Nature| షాకింగ్..ప్రకృతి చూపిన పుష్పా 2 సినిమా దృశ్యాలు
Telangana IAS officers | అప్పుడూ వాళ్లే.. ఇప్పడూ వాళ్లే! ప్రభుత్వం ఎవరిదైనా చక్రం వారి చేతిలో!
అట్లీ సూపర్‌హీరో కథ..విలన్‌గా అల్లు అర్జున్.?