Telangana BC reservations | హైదరాబాద్, జూలై 21 (విధాత) : బీసీ రిజర్వేషన్ల విషయంలో మాటను నెరవేర్చుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనందున బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయమై చర్చించేందుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరారని తెలిసింది. ఈ నెల 24న బీసీ రిజర్వేషన్లు, కులగణనపై ఇండియా కూటమి ఎంపీలకు రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం ద్వారా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించాలని రేవంత్ భావిస్తున్నారని సమాచారం. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కులగణనలో తెలంగాణ మోడల్‌ను అమలు చేయించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం కోర్టులో బంతిని నెట్టేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీకి రేవంత్ రెడ్డి
బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన ఎజెండాగా తెలంగాణ సీఎం ఏ రేవంత్ రెడ్డి జూలై 24న ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బీసీలకు 29 నుంచి 42 శాతానికి రిజర్వేషన్ల పెంపు, విద్య, ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను కేంద్రానికి పంపారు. ఈ ఏడాది మార్చి 18న ఈ రెండు బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులు పార్లమెంట్ ఉభయసభల్లో 2/3 మెజారిటీతో ఆమోదం పొందితేనే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. అప్పుడే ఆ రిజర్వేషన్లకు రాజ్యాంగపరంగా రక్షణ లభిస్తుంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 50 శాతానికి మించినా ఇబ్బంది లేదనే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారని సమాచారం. మోదీ అపాయింట్‌మెంట్ లభిస్తే బీసీలకు రిజర్వేషన్ల బిల్లు అంశం గురించి కూడా చర్చిస్తారని తెలుస్తున్నది. పనిలో పనిగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ వంటి అంశాలను కూడా చర్చించే చాన్స్ ఉంది.
బీసీ రిజర్వేషన్లపై ‘ఇండియా’ ఎంపీలకు ప్రజెంటేషన్
బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇండియా కూటమి ఎంపీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 24న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎఎన్నికలకు ముందు కామారెడ్డిలో సభ నిర్వహించి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. ఇందులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేస్తామని కూడా ఇచ్చిన హామీని అమలు చేసింది. రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కలు తీసింది. ఈ సర్వేను అసెంబ్లీ ముందు పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపుగా నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు చేరింది. గవర్నర్ అనుమతి పొందితే జీవో జారీ చేయనున్నారు. ఈ విషయాలను ఎంపీలకు పవర్ పాయింట్ ద్వారా సీఎం , డిప్యూటీ సీఎంలు వివరించనున్నారు. బీసీలకు రిజర్వేషన్లు, కులగణన విషయంలో తెలంగాణ మోడల్‌ను తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
బీజేపీ ఏమంటోంది?
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బీసీల జనాభా 56.33 శాతంగా తేలింది. ఇందులో ముస్లింలకు చెందిన 10శాతం కూడా కలిపారు. ముస్లింల జనాభా తొలగిస్తే బీసీల జనాభా 46 శాతం. బీసీల్లో 10 శాతం ముస్లింల జనాభా కలపడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు దక్కాలనేది తమ పార్టీ డిమాండ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో 51 శాతం ఉన్న బీసీ జనాభాకు 32 శాతం రిజర్వేషన్లు, 12 శాతం ఉన్న ముస్లింలకు వందకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్నారనేది బీజేపీ ఆరోపణ. దీని ద్వారా బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ తన వైఖరి ఏంటో తేల్చి చెప్పింది. అయితే పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే బీజేపీ సహకారం అవసరమైన వేళ.. ఆ పార్టీ నాయకత్వం అభ్యంతరాలు చెబుతుండటం ఆసక్తికరంగా మారింది.
రాజకీయంగా పైచేయి కోసమా?
ఈ రెండు బిల్లులకు పార్లమెంటు ఆమోదంలో బీజేపీదే కీలక పాత్ర. కానీ.. బీజేపీ అభ్యంతరాలు చెబుతున్నది. వాటితో బిల్లులకు అడ్డం పడితే.. రిజర్వేషన్లు దక్కకపోవడానికి బీజేపీయే కారణమని ప్రచారం చేసే అవకాశం ఉంటుందనేది కాంగ్రెస్ నేతల భావనగా కనిపిస్తున్నది. రిజర్వేషన్ల అమలు విషయంలో సాకులు చూపకుండా ఉండాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇతరులపై నెపం నెట్టి రిజర్వేషన్లు అమలు చేయకుండా తప్పించుకోవద్దనేది విపక్షాల మాట.
ఇవి కూడా చదవండి..
Sasi Tharoor Vs Congress | కాంగ్రెస్ పార్టీ నుంచి శశిథరూర్ నిష్క్రమణ తప్పదా?
PM Mallikarjuna Kharge? | మోదీ రాజీనామా చేస్తే ఖర్గే ప్రధాని!
Kangra train bridge collapse | వీడియో : వేల మందితో రైలు వెళుతుంటే.. కూలిపోయిన వంతెన బేస్..
Revanth vs Rajagopal | కాంగ్రెస్‌లో ‘పదేళ్ల సీఎం’ లొల్లి! రేవంత్ వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి ఫైర్