Huge Statue in Hyderabad | అంబేద్కర్ విగ్రహం కంటే ఎత్తులో ఫూలే విగ్రహం ఉంటుందా?
అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ప్రఖ్యాత సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతున్నది. ఇది కూడా భారీగానే ఉండబోతున్నదని ప్రాథమికంగా తెలుస్తున్నది

- మహాత్మా ఫూలే విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ సంకల్పం
- లేక్‌వ్యూ పార్క్‌లో నిర్మించే అవకాశం
- స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- అంబేద్కర్ విగ్రహాన్ని మించి ఎత్తు ఉంటుందా?
- లేక అదే ఎత్తులో నిర్మిస్తారా? తగ్గిస్తారా?
- బీసీ కులాల్లో చర్చలు
(విధాత ప్రత్యేకం)
Huge Statue in Hyderabad | రాష్ట్ర రాజధానిలో మరో భారీ విగ్రహం ఏర్పాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్లేస్ రోడ్డులోని లేక్ వ్యూ పార్క్‌లో దీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నెక్లేస్ రోడ్డు వద్ద రాజ్యాంగ నిర్మాత, సకల జన బాంధవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గతంలో బీఆరెస్ ప్రభుత్వం నిర్మించింది. సచివాలయంలో కూర్చొన్న అధికారి.. అప్పుడప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని చూసి.. నిర్ణయాలు తీసుకోవచ్చని ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ప్రఖ్యాత సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతున్నది. ఇది కూడా భారీగానే ఉండబోతున్నదని ప్రాథమికంగా తెలుస్తున్నది. అయితే.. అంబేద్కర్ విగ్రహం ఎత్తులో నిర్మిస్తారా? ఆ విగ్రహం కంటే నాలుగైదు అడుగులు ఎత్తు ఉండేలా రూపొందిస్తారా? అన్న చర్చ బీసీ కులాల్లో ఊపందుకున్నది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర జనాభాలో ఏ కులంవారు ఎంత మంది ఉన్నారు? వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై సమగ్రంగా సర్వే నిర్వహించి శాస్త్రీయంగా రిపోర్టు రూపొందించారు. సర్వే బాధ్యతను తెలంగాణ బీసీ కమిషన్‌కు అప్పగించగా, మొత్తం జనాభాలో 56.36 శాతం బీసీలు ఉన్నట్లు లెక్కలు తేలాయి. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కుల గణన నివేదికను అందచేసింది. ఈ నివేదికను అధ్యయనం చేసిన మంత్రివర్గం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని తీర్మానించి, మార్చి నెలలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశ పరిచింది. ఈ సమావేశంలో రెండు బీసీ బిల్లులను ఆమోదించి రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపించింది. విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ రెండు బిల్లులను రూపొందించారు. ఈ బిల్లులను పరిశీలించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న విషయం తెలిసిందే.
బీసీ కులాలను తమవైపు తిప్పుకొని ఓటు బ్యాంకుగా మలచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు. నేను బీసీని అని చెప్పుకొంటున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీని నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకోవడమే కాకుండా తాము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని, అనేక కార్యక్రమాలు చేపడ్తామని చెబుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఫూలే విగ్రహ ఏర్పాటు విషయంలో నిర్ణయాలు తీసుకున్నదని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు కోసం లేక్ వ్యూ పార్క్‌ను పరిశీలించారు. పూర్తిస్థాయి ప్రణాళికతో నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రోడ్డుకు ఇటువైపుగా పూలే విగ్రహం ప్రతిష్ఠిస్తుండగా, ఆ వైపున అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహం ఇప్పటికే ఉన్నది. 476 టన్నుల కాంస్యం, స్టీలుతో 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేశారు. 11 ఎకరాల్లో మ్యూజియం, లైబ్రరీ, ఆడిటోరియం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విగ్రహంతో పాటు మ్యూజియం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.145 కోట్లు వెచ్చించింది. అంబేద్కర్ విగ్రహం కోసం కేటాయించిన విధంగానే రూ.145 కోట్లు కేటాయించి అంతే ఎత్తులో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేస్తారా, మొక్కుబడిగా విగ్రహం ఏర్పాటు చేసి వదిలేస్తారా? అనేదానిపై స్పష్టత రాలేదు.
ఒక వేళ విగ్రహానికి ఖర్చు తగ్గించి, తక్కువ ఎత్తులో ప్రతిష్ఠిస్తే బీసీ కులాల నుంచి విమర్శలు వచ్చే ప్రమాదముంది. అంబేద్కర్ కన్నా ఎక్కువ ఎత్తుతో నిర్మిస్తే వచ్చే స్పందనలేంటన్న చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు పోతుందనేది అధికారులు ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పలు సందర్భాలలో సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే తనకు ఆదర్శమని చెప్పారు. సామాజిక సంస్కరణలు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం, మహిళల విద్య కోసం ఆయన చేసిన విశేష కృషిని గుర్తించిన అంబేద్కర్ తన గురువుగా భావించి, ఆయన బోధనలను ఆచరణలో పెట్టారు. ఫూలే తో పాటు గౌతమ బుద్ధుడు, కబీర్ దాకస్‌లను తన గురువులుగా 1954 లో ప్రపంచ ప్రఖ్యాత బీబీసీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబేద్కర్ తెలిపారు. చరిత్రలో మరిచిపోలేనటువంటి ఈ అంశాలను తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.