పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..

తెలంగాణలో పరిషత్‌ ఎన్నికల నిర్వహణ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఎన్నికల అధికారుల ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తుంటే.. ఒక కీలక మంత్రి మాత్రం ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవని సంకేతాలిస్తున్నారు.

పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..

విధాత, హైదరాబాద్‌:
రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారనే వార్తలు రావడంతో ఒక్కసారిగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కింది. త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తారేమోనన్న నమ్మకంతో పలువురు నాయకులు తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లకు గాలం వేసేందుకు డబ్బులు కూడా సమకూర్చుకుంటున్నారనే వార్తలూ వినిపించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పట్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఏమాత్రం లేదని తెలుస్తోంది. వానాకాలం మొదలైన తరువాత వర్షాలు కురుస్తున్న సమయంలోనే ఎన్నికలకు వెళ్తామని, అప్పటి వరకు ఎలాంటి షెడ్యూలు వెలువడదని ఒక మంత్రి సూచనప్రాయంగా వెల్లడించారు. మండుతున్న ఎండల్లో ఎన్నికలు నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. కోడ్ కారణంగా పనులకు ఆటంకం ఏర్పడే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2019 మే నెలలో మూడు విడతల్లో నిర్వహించారు. ఫలితాల ప్రకటన తరువాత జూన్ నెలలో ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్‌లను ఎన్నుకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది జూన్ నెలలో ఐదు సంవత్సరాలు నిండటంతో పదవీకాలం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులు, గ్రాంట్ల కోసం ఎన్నికలు నిర్వహిస్తుందని అందరూ ఆశించారు. ఆ ప్రకారంగానే గత ఏడాది సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలో 566 జెడ్పీటీసీలు, 5,773 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పంచాయతీరాజ్ సీట్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపించింది. మున్సిపాల్టీల్లో గ్రామ పంచాయతీలు విలీనం కావడంతో 4 జెడ్పీటీసీలు, 44 ఎంపీటీసీలు తగ్గాయి. మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాగా ప్రకటించడంతో ఆ జిల్లా పరిషత్ ను తొలగించారు. హైదరాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో చోటా మోటా గ్రామీణ ప్రాంత నాయకులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సంకేతాలు ఇచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉండేందుకు ఉత్తర్వులు జారీ చేశామని, మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు కాదని ఒక అధికారి వివరించారు. మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ మినహా మిగతా 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా ఓటరు జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా కొత్త జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళాయి. ఈ నెల 23 తరువాత ఓటర్ల ముసాయిదా జాబితాను గ్రామాల వారీగా విడుదల చేసి, అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానించనున్నారు. బ్యాలెట్ బాక్సుల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ నెలాఖరు వరకు ఎండల భగభగ ఉండనుండడంతో ఎన్నికల నిర్వహణ పై ప్రభుత్వం ముందుకు వెళ్లే పరిస్థితి లేదంటున్నారు.

ఈసారి వానకాలంలో ఆశించిన స్థాయి కన్న తక్కువగా వర్షపాతం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే సాహసానికి ప్రభుత్వం పునుకోవడం లేదు. ఏది ఏమైనా జూలై లేదా ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించవచ్చని, అది కూడా వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులు ఖాతాల్లో వేసిన తరువాతే షెడ్యూలు ప్రకటించవచ్చనే చర్చ సచివాలయంలో జరుగుతోంది. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే జూన్ నెల తరువాతే అని, లేదంటే అక్టోబర్ నెలలో నిర్వహించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు.

ఇవి కూడా చదవండి..