BJP protocol violation | కేంద్ర మంత్రుల పర్యటనకు కాషాయ రంగు
మంత్రులు, ప్రజాప్రతినిధులే స్వయంగా పార్టీ నేతలను తమ పర్యటనల్లో వెంటపెట్టుకుని తిరుగుతూ వేదికలపైకి ఆహ్వానించ పక్కన కూర్చొపెట్టుకుంటున్నారని అంటున్నారు. ఒకరిని చూసి ఒకరు అన్నట్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే వేదికలపైన ఆ పార్టీ నాయకుల హడావుడి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేక ప్రతినిధిః శనివారం వరంగల్‌లో కేంద్ర మంత్రుల అధికారిక పర్యటనలో కాషాయ పార్టీ నాయకుల హంగామాగా కనిపించింది. అసలు మంత్రులకంటే ఆ పార్టీ నాయకుల హడావుడి ఎక్కువైందనే విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ నాయకుల తాకిడితో కొందరు అధికారులు సైతం ఇబ్బందులపాలయ్యారు. కనీస ప్రొటోకాల్ కూడా పాటించకుండా పర్యటన ఆసాంతం పార్టీ నాయకుల హంగామా కనిపించింది. మీడియా, ఇతర రైల్వే అధికారులకు ప్రవేశంలో అనేక అడ్డంకులు కల్పించిన అధికారులు.. బీజేపీ నాయకులను కట్టడిచేయకుండా చూసీచూడనట్లు వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. కాజీపేటలో నిర్మాణంలో ఉన్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలనకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శనివారం ప్రత్యేక రైల్లో హైదరాబాద్ నుంచి కాజీపేటకు వచ్చారు. తమ పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు హాజరై స్వాగతం పలుకడం సహజమైన అంశం. మంత్రులు వస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సంబంధిత శాఖ సమస్యలపై కలిసి విన్నవించడం పరిపాటి. కానీ, ఈ పర్యటనలో మంత్రుల పర్యటన, పరిశీలన, చివరికి మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా పార్టీ నాయకులు పోటీపడ్డారు. తమకేమో నిబంధనల పేరుతో అడ్డుకున్నారని పలువురు రైల్వే అధికారులు, కొందరు యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు మాత్రం ప్రజాప్రతినిధుల మాదిరిగా ప్రోటోకాల్ పట్టించుకోకుండా వ్యవహరించారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక పర్యటనను కాస్తా సొంత పార్టీ కార్యక్రమంగా మార్చేశారని మండిపడుతున్నారు.
ఆరంభం నుంచే ప్రొటోకాల్‌కు తిలోదకాలు
ఆరంభం నుంచే ప్రొటోకాల్‌కు తిలోదకాలిచ్చారనే విమర్శలున్నాయి. ఈ పర్యటనకు ప్రత్యేక రైల్లో కేంద్రమంత్రులతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వచ్చారు. రామచందర్ రావు మాజీ ఎమ్మెల్సీ తప్ప ఇప్పుడు కనీస ప్రజాప్రతినిధి కాదని గుర్తు చేస్తున్నారు. ఇక పరిశ్రమ పర్యటనలో కేంద్రమంత్రులతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల కంటే మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులే ఎక్కువగా కనిపించారు. మంత్రుల వెంట బీజేపీ నాయకులు రామచందర్‌రావుతో పాటు మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, అరూరి రమేష్, రావు పద్మ, గంట రవికుమార్ చుట్టూ పార్టీ నాయకులే కనిపించారు. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల అధికారిక కార్యక్రమాలకు స్వంత పార్టీ కార్యక్రమాలకు తేడాలేకుండా పోయిందంటున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు మధ్య వ్యత్యాసం కనిపించడం లేదంటున్నారు. ఎటొచ్చి అధికారులకే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులే స్వయంగా పార్టీ నేతలను తమ పర్యటనల్లో వెంటపెట్టుకుని తిరుగుతూ వేదికలపైకి ఆహ్వానించ పక్కన కూర్చొపెట్టుకుంటున్నారని అంటున్నారు. ఒకరిని చూసి ఒకరు అన్నట్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే వేదికలపైన ఆ పార్టీ నాయకుల హడావుడి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడైతే అక్కడి ప్రజాప్రతినిధుల కంటే పార్టీ నాయకులకు పీటలు వేస్తున్నారని దీంతో ప్రోటోకాల్ రగడ తలెత్తుతోందని చెబుతున్నారు. ఈ పద్ధతికి స్వస్తిపలికేందుకు పార్టీలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపినప్పుడే ప్రొటోకాల్‌కు గౌరవం ఏర్పడుతుందని అంటున్నారు.