Amrapali Mango Story | మామిడి పండ్ల క్వీన్‌.. ‘ఆమ్రపాలి’ కథాకమామిషు ఇదే..

వేసవిలో మామిడి పళ్ల సీజన్‌ అంటే.. మనకు బాగా తెలిసిన మామిడి రకాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. కానీ వాటిలో మరో ప్రత్యేకమైన రకం ఉంది. అది.. చరిత్ర, శాస్త్రం, రుచి అన్నింటినీ కలిపిన మామిడి. అదే ‘అమ్రపాలి’. దీని కథ కూడా దాని రుచిలానే అద్భుతంగా ఉంటుంది.

Amrapali Mango Story

Amrapali Mango Story | వేసవి వచ్చిందంటే.. నోరూరించే మామిడి పళ్ల సీజన్‌ వచ్చేసిందని అర్థం. సాధారణంగా వేసవిలో అనేక రకాల మామిడి పళ్లు మార్కెట్లలో పోటెత్తుతాయి. ఇలాంటి మామిళ్లలో ఒక రకం పేరు ఆమ్రపాలి. అద్భుతమైన రుచి, సువాసన కలిగిన ఈ రకం మామిడి పండు… ఒక పురాతన కథతోపాటు.. శాస్త్రీయ విజ్ఞాన కలయికను జంటగా కలిగి ఉంది. అదే మామిడి రైతులను ఈ పండు పట్ల ప్రేమను పెంచింది. తినేవారికి కూడానండోయ్‌!!

పురాణం నుంచి వచ్చిన పేరు

“అమ్రపాలి” అనే పేరు కేవలం అలంకారమే కాదు, అది ప్రాచీన భారతదేశపు కథలతో ముడిపడి ఉంది. వైశాలి నగరానికి చెందిన ఆమ్రపాలి అనే ప్రసిద్ధ మహిళ పేరిట.. ఈ మామాడికి ఆ పేరు వచ్చింది. ఆమ్రపాలి.. అటు అందం, ఇటు ప్రతిభతో ప్రసిద్ధి చెందింది. తర్వాతి కాలంలో ఆమె ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా అనుసరించింది. ఒక రాజ భవన ప్రాంగణంలోని మామడి చెట్టు కింద పసికందు కనుగొంటారు. అందుకే ఆమెకు ఆమ్రపాలి అనే పేరు వచ్చిందని పుణాలు చెబుతున్నాయి. ఆమ్ర అంటే మామిడి అని అర్థం. దీన్నిలా ఉంచితే.. శతబ్దాల తర్వాత.. అంటే 1971లో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.. సృష్టించిన మామడి పండుకు ఆమె పేరిట.. ఆమ్రపాలి అని పేరు పెట్టారు. అందం, మాధుర్యం, సాంస్కృతిక గుర్తింపుకు ఇది ఒక గౌరవంగా భావించవచ్చు. అందుకే దీనిని చాలామంది “మామిడి పండ్ల రాణి”గా కూడా పిలుస్తారు.

శాస్త్రంతో పుట్టిన కొత్త రకం

పేరు చరిత్రలోనిదే అయినా.. అమ్రపాలి మామిడి మాత్రం పూర్తిగా శాస్త్రీయ ప్రయోగాల ఫలితం. 1971లో ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రముఖ హార్టికల్చర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ పిజూష్‌ కాంతి మజుందార్‌ ‘ఆమ్రపాలి’ మామిడి పండును అభివృద్ధి చేశారు. అప్పట్లో ఒక సమస్య ఉండేది. సంప్రదాయ మామిడి పండ్లు పెద్దగా పెరిగేవి. కానీ.. ప్రతి సంవత్సరం పండ్లను ఇచ్చేవి కావు. ఉత్పత్తి స్థిరంగా ఉండేది కాదు. ఈ సమస్య పరిష్కరానికి రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు వేల సంఖ్యలో క్రాస్‌ పొలినేషన్‌ ప్రయోగాలు చేశారు. అందులో దశేరీ మామిడి, నీలమ్‌ మామిడి రకాలను ఉపయోగించారు. దశేరీ మామిడి.. తీపి, సువాసనకు ప్రసిద్ధి. ఇక నీలం మామిడి.. ప్రతి సంవత్సరం పండ్లు ఇచ్చే లక్షణాన్ని కలిగి ఉంది. ఈ రకం ఆలస్యంగా పండుతుంది. ఈ రెండు పండ్ల రకాల గుణాలను కలిపి, ఎన్నో ఏళ్ల పరిశీలన, ప్రయోగాల అనంతరం ఇప్పుడు ఉన్న ఆమ్రపాలి అనే హైబ్రిడ్‌ మామిడి పుట్టింది.

రైతులకు వరం

సీజన్ చివర్లో వచ్చే మామిడి

అమ్రపాలి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఆలస్యంగా పండుతుంది. అంటే.. జూన్‌ మధ్య నుంచి చివరి రోజులలో మార్కెట్‌లోకి వస్తుంది. మామిడి సీజన్‌ ముగిసిపోతుందని అనుకునే సమయంలో మళ్లీ మామిడి రుచిని.. అందులోనూ అద్భుతంగా పరిచయం చేస్తుంది. ఒక విధంగా.. మామిడి సీజన్‌ ఇంకా ముగిసిపోలేదు.. అని చెప్పే చివరి కానుకలా ఉంటుంది.

రుచితో పాటు ఆరోగ్యం

అమ్రపాలి మామిడి రుచి మాత్రమే కాదు, పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులోని విటమిన్‌ ఏ.. కళ్ల ఆరోగ్యానికి, విటమిన్‌ సీ రోగ నిరోధక శక్తికి, దీనిలోని యాంటాక్సిడెంట్లు, బీటా కెరోటిన్‌.. ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. వెరసి.. ఆమ్రపాలి సాధారణ మామిడి రకం కాదు.. ఇది ఒక కథ.. ఒక శాస్త్రీయ విజయం.. ఒక వ్యవసాయ మార్పు… కలగలిసిన ప్రత్యేక ఫలం.

Latest News