Desi Cow Farming | సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి దేశీ ఆవుల పెంపకం.. డెయిరీ ఫామ్‌తో ఏటా 10 కోట్ల టర్నోవర్ చేస్తున్న టెకీ!

Desi Cow Farming | సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. నెలకు లక్షల్లో జీతం వదిలేసి ఓ టెకీ ఆవుల పెంపకం మొదలుపెట్టాడు. పాడి పరిశ్రమ మీద ఉన్న ఆసక్తితో కష్టపడి పనిచేసి ఇప్పుడు ఏటా రూ.10 కోట్ల టర్నోవర్ సాధిస్తూ.. 110 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

Desi Cow Farming | సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. నెలకు లక్షల్లో జీతం వదిలేసి ఓ టెకీ ఆవులను పెంచుకుంటున్నాడు. పాడి పరిశ్రమ మీద ఉన్న ఆసక్తితో ఐటీ జాబ్ మానేసి.. డెయిరీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. తన ఆలోచనపై నమ్మకం, పట్టుదల, కృషితో ఇప్పుడు ఏటా రూ.10 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. తనతో పాటు 110 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌కు చెందిన అసీమ్ రావత్ జీవితం ప్రస్తుతం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఐటీ నుంచి డెయిరీ వైపు అడుగులు..!

అసీమ్ రావత్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించి.. కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో పనిచేశాడు. ఆ తర్వాత విదేశాలకు కూడా వెళ్లాడు. సుమారు 14 ఏళ్ల పాటు ఐటీ రంగంలో ఎదిగిన తర్వాత తన జీవితంలో కొంత అసంతృప్తి మొదలైంది. జీవితం ఉంటే ఉద్యోగం, జీతం, రొటీన్ మాత్రమేనా అనే ప్రశ్న అతని మెదడును తొలిచివేసింది.

టీవీ డిబేట్‌ చూసి పుట్టిన ఆలోచన

జీవితంలో ఏదైనా సాధించాలనే ఆలోచనలో ఉన్న సమయంలో దేశీ ఆవులపై జరిగిన టీవీ డిబేట్ అసీమ్ రావత్ జీవితాన్నే మార్చేసింది. ఆ టీవీ డిబేట్‌లో దేశీ ఆవులు తక్కువ పాలు ఇస్తాయని, వాటితో వ్యాపారం సాధ్యం కాదని ఒక వర్గం చెప్పగా.. దేశీ ఆవుల ఔషధ, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని మరో వర్గం వివరించింది. ఆ డిబేట్ అసీమ్‌ మనసును బలంగా తాకింది. గోమాత గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం.. అలాంటిది దేశీ ఆవులతో డెయిరీ వ్యాపారం ఎందుకు లాభదాయం కాదని ప్రశ్న తలెత్తింది. ఎలాగైనా దేశీ ఆవులతో సక్సెస్‌ఫుల్ బిజినెస్ చేయొచ్చని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు.

ఫ్యామిలీ నో చెప్పినా వెనక్కి తగ్గలే!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఆవులను పెంచాలన్న ఆలోచనను అసీమ్ రావత్ కుటుంబసభ్యులకు చెప్పగానే వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిన్నతనం నుంచి ఆవుల పెంపకంపై అవగాహన లేదు.. ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నావు.. నీతో డెయిరీ ఎలా సాధ్యమవుతుందని సందేహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అసీమ్ రావత్ వెనక్కి తగ్గలేదు. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనే పట్టుదలతో ముందుకు సాగాడు. మొదట రెండు దేశీ ఆవులు కొనుగోలు చేసి, వాటితో ప్రయోగాత్మకంగా డెయిరీ ఫామ్ ప్రారంభించాడు. అలా 2015లో హేతా ఆర్గానిక్ ప్రయాణం మొదలైంది.

2015 డిసెంబర్‌లో అసీమ్ రావత్ హేతా ఆర్గానిక్‌‌ను ప్రారంభించాడు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. ప్రధాని మోదీ తీసుకొచ్చిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభానికి కేవలం వారం రోజుల ముందే అసీమ్ డెయిరీ ఫామ్ మొదలుపెట్టాడు. దీంతో ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సహకాలు అందలేదు. కేవలం సొంత పెట్టుబడితోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. 1100కి పైగా ఆవులు, 130కి పైగా డెయిరీ ఉత్పత్తులు, ఐదు ఫారాలు, 110 మందికి పైగా ఉద్యోగులతో హేతా ఆర్గానిక్ ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది.

ఈ సక్సెస్ వెనుక ఎంతో కష్టం!

ఈ విజయం అంత సులువుగా దక్కలేదు. దీని వెనుక ఎంతో కష్టపడ్డారు. డెయిరీ ఫామ్ మొదలుపెట్టడానికి ముందు దేశీ ఆవులతో నడుస్తున్న డెయిరీ ఫామ్‌లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు అనేక రాష్ట్రాలను తిరిగారు. ఈ క్రమంలో ఎక్కువగా హైబ్రిడ్ జాతులు లేదా గేదెలతోనే డెయిరీలు నడుస్తున్నాయని ఆసీమ్‌కు కనిపించారు. బిజినెస్ కోసం కాకుండా కేవలం అభిరుచిగా మాత్రమే దేశీ ఆవులను పెంచడం గమనించాడు. దీంతో ఏ మోడల్ చూడకుండా తానే స్వయంగా దేశీ ఆవులతో ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎన్ని సమస్యలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఒక మోడల్‌ను రూపొందించుకున్నాడు.

తన ప్లాన్ ప్రకారం హేతా ఆర్గానిక్ సంస్థను నడిపిస్తున్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటివరకు నెలకు లక్షల్లో జీతం వస్తుండగా.. జాబ్ మానేశాక ఆదాయం లేకుండా పోయింది. దీంతో ఖర్చులకు ఇబ్బంది ఉండేది. అదికాకుండా వ్యవసాయం, పశుపోషణ రంగాల్లో నైపుణ్యం ఉన్న సిబ్బంది దొరకడం కూడా కష్టమైపోయింది. పైగా మామూలు ఆవు పాలతో పోలిస్తే దేశీ ఆవుల పాల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో దేశీ ఆవు పాల ఉత్పత్తులు ఎందుకు ఖరీదైనవో ప్రజలకు వివరించి, ప్రజలను వాటివైపు మళ్లేలా చేయడం అతిపెద్ద సవాలుగా మారింది. అయితే పట్టుదలతో, ఓర్పుతో ఈ సమస్యలను అధిగమించాడు.

ఐదు ఫారాలు.. 110 మంది ఉద్యోగులు

ప్రస్తుతం ఈ హేతా ఆర్గానిక్ సంస్థ ఐదు ఫారాలకు విస్తరించింది. వీటిలో మూడు ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఉండగా.. మరో రెండు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, బులంద్‌షహర్ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి ద్వారా 130కిపైగా ఆర్గానిక్ డెయిరీ ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఈ ఉత్పత్తులను తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ వేదికగా కూడా విక్రయిస్తున్నారు. అలా మొత్తానికి రెండు ఆవులతో మొదలైన హేతా ఆర్గానిక్ ఇప్పుడు ఏటా 10 కోట్లకు పైగా టర్నోవర్ సాధిస్తూ.. 110 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది.

కష్టానికి దక్కిన గుర్తింపు!

దేశీ ఆవుల పరిరక్షణ, స్వచ్ఛమైన పాల ఉత్పత్తుల తయారీలో అసీమ్ రావత్ చేసిన కృషికి తగిన గుర్తింపు కూడా లభించింది. అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు ఆయన్ను వరించాయి. కేంద్ర ప్రభుత్వం గోపాల్ రత్న అవార్డుతో కూడా సత్కరించింది. కాగా, దేశీ ఆవులపై తన నమ్మకం ఎప్పటికీ మారదని అసీమ్ రావత్ తెలిపారు. ప్రస్తుతం తన ఫామ్ గిర్, థార్ పార్కర్, సాహివాల్, బద్రీ వంటి నాలుగు దేశీ జాతుల ఆవులతోనే నడుస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ నాలుగు జాతులతోపాటు మరిన్ని దేశీ జాతులను కూడా తన ఫామ్‌లోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు.

Read More

‘బాతు’ గుడ్ల వ్యాపారం.. ఏడాదికి రూ. 2.25 కోట్లు సంపాదిస్తున్న యువ‌కుడు

పుచ్చ‌కాయ‌ల సాగు.. 3 నెల‌ల్లోనే రూ. కోటికి పైగా సంపాద‌న‌..

Latest News