భారతదేశంలో భూమి అంటే ఒక ఆస్తిగానే చూడరు. వాస్తవానికి అది సదరు వ్యక్తి గుర్తింపును, శక్తిని, అతనికి ఉన్న భద్రతకు కూడా ప్రతీకగా ఉంటుంది. కానీ.. భూమి పంపిణీ విషయంలో పెద్ద ఎత్తున అసమానతలు ఉన్నాయని తెలిసిందే. అయితే.. అవి ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో తాజాగా ఒక నివేదిక బయటపెట్టింది. దేశంలో టాప్ పది శాతం కుటుంబాల చేతిలో 44 శాతం భూమి ఉందని వరల్డ్ ఇనీక్వాలిటీ లాబ్ విడుదల చేసిన నివేదిక పేర్కొంటున్నది. అందులోనూ టాప్ 1 శాతం కుటుంబాల ఆధీనంలోనే 18 శాతం భూములు ఉన్నాయి. దేశంలోని సుమారు 2.7 లక్షల గ్రామాల్లో 65 కోట్ల మందిపై ఆధారపడి ఈ అధ్యయనం రూపొందించారు. ఇందులో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. గ్రామీణ భారతదేశంలో ఏ మాత్రం భూమి లేని కుటుంబాలు 46 శాతం ఉన్నాయి.
ప్రతి గ్రామంలో బడా భూస్వామి సగటున 12.4 శాతం భూమిపై ఆధిపత్యం కలిగి ఉండగా.. 3.8 శాతం గ్రామాల్లో ఒకే వ్యక్తి 50శాతానికంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నాడని అధ్యయనంలో తేలింది. అందులోనూ వ్యసాయానికి అనువైన అత్యంత సారవంతమైన భూముల విషయంలో ఈ అసమానతలు మరింత తీవ్రంగా ఉన్నాయని అధ్యయనం బయటపెట్టింది. సమృద్ధిగా సాగునీటి వనరులు, అనుకూల వాతావరణం ఉన్న ప్రాంతాల్లో సహజంగానే భూమి విలువ పెరుగుతుంటుంది. ఈ భూములను బడా భూస్వాములు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో ఈ అసమానత మరింత పెరుగుతున్నది. అదే సమయంలో చిన్న రైతులు క్రమంగా తమ భూమిని కోల్పోతున్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులలో భూస్వాములకే లబ్ధి
వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వాలు చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలు సరిగ్గా అమలు చేయనిపక్షంలో బడా భూస్వాములకే ఎక్కువగా మేలు జరుగుతుందని అధ్యయనం వెల్లడించింది. ఇది కూడా అసమానతలకు కారణమవుతున్నదని పేర్కొన్నది.
కొనసాగుతున్న వలస పాలన ప్రభావాలు
బ్రిటిష్ కాలం నాటి జమిందారీ వ్యవస్థ ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయని అధ్యయనం పేర్కొంటున్నది. బ్రిటిష్ కాలంలో జమిందారీ ప్రాంతాల్లో కొంతమంది బడా భూస్వాముల చేతిలో పెద్ద మొత్తంలో భూమి పోగుపడిపోయిందని, వలస పాలన పోయినా.. ఇప్పటికీ ఆ ప్రభావం కొనసాగుతూనే ఉన్నదని వెల్లడించింది. అంతకు ముందు రాజుల కాలంలో ఈ అసమానతలు తక్కువగా ఉండేవని పేర్కొన్నది. స్థానిక పాలకుల కంటే బ్రిటిష్ పాలకుల వద్ద అధిక మొత్తంలో భూమి ఉండేది. దాంతో చిన్నసన్నకారు రైతుల వద్ద తగినంత భూమి ఉండేది. దీని కారణంగానే అటువంటి ప్రాంతాల్లో అసమానతలు ప్రస్తుతం తక్కువ కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. అనేక దశాబ్దాలుగా ఆధునీకరణ, ఆర్థిక వ్యవస్థలో మార్పులు, భూ సంస్కరణలు వచ్చినా.. ఈ తేడాలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నది.
కుల వ్యవస్థకూ పాత్ర
దేశంలో పాతుకుపోయిన కుల వ్యవస్థ సైతం ఈ భూ అసమానతలకు ఒక ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూమి పంపిణీలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. శతాబ్దాల పాటు భూమిపై అజమాయిషీకి దూరంగా ఉండిపోయిన ఎస్సీలు ఇప్పటికీ భూమి యాజమాన్యం విషయంలో వెనుకబడే ఉన్నాయని పేర్కొంది.
స్ట్రాటజిక్ ఏరియాల్లో…
వ్యూహాత్మక ప్రాంతాలు సైతం భూమి అసమానతలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. పట్టణాలు, నగరాలు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో భూమికి గట్టి ధర పలుకుతున్నది. దీంతో ఆయా ప్రాంతాల్లో ధనికులే ఎక్కువగా భూములు కొనుగోలు చేసుకుంటున్నారు. ఇది కూడా అసమానతలు పెరిగేందుకు కారణమని నివేదిక తెలిపింది. బ్యాంకులు, వ్యవసాయ మార్కెట్లకు సమీప ప్రాంతాల్లో సైతం ఈ అసమానతలు కనిపిస్తున్నాయని వెల్లడించింది.
పరిష్కారం?
దేశంలో భూమి యాజమన్యం విషయంలో కనిపిస్తున్న ఈ తీవ్రమైన వ్యత్యాసాలను పరిష్కరించడానికి ఆర్థిక అభివృద్ధి ఒక్కటే సరిపోదని, సమగ్ర భూ సంస్కరణలు, వాటి పకడ్బందీ అమలుతోపాటు.. బలహీన వర్గాలకు తగినంత రక్షణ కల్పించాలని నివేదిక సూచిస్తున్నది. ఇప్పటికే పాతుకుపోయిన సామాజిక వర్గాల నిర్మాణంలో మార్పులు రానిదే ఈ అసమానతలు తగ్గవని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
యుద్ధానికి రెండు వారాల బ్రేక్.. దిగొచ్చిన ట్రంప్.. హర్మూజ్‌ను తెరుస్తామన్న ఇరాన్
నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఏప్రిల్ 9 నుంచి హీట్‌వేవ్, 44°C హెచ్చరిక
