యుద్ధానికి రెండు వారాల బ్రేక్.. దిగొచ్చిన ట్రంప్.. హర్మూజ్‌ను తెరుస్తామన్న ఇరాన్
మధ్య ఆసియా ప్రాంతంలో సాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. రాత్రికి రాత్రే ఇరాన్ నాగరికతను నిర్మూలిస్తామన్న ట్రంప్.. గడువుకు ముందు ఉభయ పక్షాల సీజ్‌ఫైర్‌ను ప్రకటించారు. ఇరాన్ సైతం దానికి ఆమోదం తెలిపింది. దీంతో హర్మూజ్ జల సంధి నుంచి నౌకల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు ఇరాన్ ప్రకటించింది.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. సుమారు గత నలభై రోజులుగా వరుస గడువులు పెడుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దిగివచ్చారు. ముందు రోజు రాత్రికి రాత్రే ఇరాన్ నాగరికతను అంతమొందిస్తామని, పాతరాతి యుగానికి పంపిస్తామని బీరాలు పలికిన ట్రంప్.. ఇరాన్ గతంలోనే ప్రతిపాదించిన పది పాయింట్ల పీస్ డీల్‌కు ఆమోదం తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం. బుధవారం ఉదయం తెల్లవారుజాము 5.30 గంటలకు) గడువు ముగియడానికి ఓ గంటన్నర ముందు తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టిన ట్రంప్.. ‘ఉభయ పక్షాల’ సీజ్‌ఫైర్‌ను ప్రకటించారు. సరిగ్గా 40 నిమిషాల తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి దానిని ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో గత నలభై రోజులుగా సాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా తెర దిగింది. రెండు దేశాలూ ఉద్రిక్తతలను తగ్గించాలంటూ పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అంతకు ముందు ఎక్స్‌లో ‘విజ్ఞప్తి’ చేసిన నేపథ్యంలో ట్రంప్, అరఘ్ఛి ప్రకటనలు వెలువడటం గమనార్హం. మొత్తానికి 39 రోజులకు యుద్ధం తాత్కాలికంగానైనా ఆగడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ట్రంప్ యుద్ధ పిపాసను ఈ 39 రోజులూ ప్రపంచం చవిచూసింది. అదే సమయంలో ఏదోఒకటి చేసి యుద్ధం నుంచి బయటపడేందుకు నానాపాట్లు పడటాన్నీ గమనించింది. ఒకవైపు యుద్ధంలో తామే గెలిచామని అమెరికా ప్రకటించుకుంటే.. గెలిచింది తామేనని ఇరాన్ తేల్చి చెప్పింది. యుద్దానికి తాత్కాలిక విరామం నేపథ్యంలో ప్రపంచ దేశాలకు ఇరాన్ గుడ్ న్యూస్ తెలిపింది. హర్మూజ్ నుంచి నౌకల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా వెల్లడించింది. మునుముందు హర్మూజ్ మార్గంలో నౌకలపై టోల్ విధించి ఆ డబ్బులను యుద్దంతో నష్టపోయిన ఇరాన్ పునర్ నిర్మాణానికి వెచ్చించాలని ఆ దేశం నిర్ణయించింది. హర్మూజ్ నుంచి నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతించడంతో ఆ మార్గంలో ఆగిపోయిన చిన్నా పెద్ద 1500నౌకలు తమ దేశాలకు చేరుకోనున్నాయి. దీంతో భారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న చమురు, గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. పశ్చిమాసియా నుంచి భారత్‌కు 70 శాతం గ్యాస్ దిగుమతి అవుతుంది. ఖతార్, యూఏఈ, సౌదీ నుంచి భారత్ గ్యాస్ దిగుమతిచేసుకుంటుంది. ఇరాన్ అనుమతితో హర్మూజ్‌లో చిక్కుకుపోయిన గ్యాస్ నౌకలు భారత్ చేరుకోనున్నాయి.
పశ్చిమాసియా యుద్ధానికి రెండు వారాల విరామం
ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహూతో కలిసి ట్రంప్.. ఇరాన్‌పై దాడులను ప్రారంభించారు. మార్చి 23 తర్వాత యుద్ధం నుంచి బయటపడేందుకు మార్గాన్వేషణ మొదలు పెట్టారు. ఆ సమయంలో ఇరాన్ పవర్‌ప్లాంట్లపై దాడులకు ఐదు రోజుల విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం దానిని పది రోజులకు పొడిగించారు. అది ఏప్రిల్ 6తో ముగిసింది. ఆ తదుపరి ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 8 గంటలు అంటూ డెడ్‌లైన్ విధించారు. అప్పటికీ ఇరాన్ చర్చలకు రాకుంటే ఆ దేశ నాగరికతనే నిర్మూలించేస్తానని బెదిరించారు. ట్రంప్ బెదిరింపులపై సొంత దేశం అమెరికాలో, అదే విధంగా సొంత పార్టీలో సైతం అసంతృప్తులు వెల్లువెత్తాయి. ట్రంప్ భాషపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యుద్ధ పిపాసి అనే ముద్ర సైతం వేయించుకున్నారు. ఎట్టకేలకు గడువుకు ముందుగానే కాల్పుల విరమణ ప్రకటించారు. హార్మూల్ జల సంధిని తక్షణమే తెరించేందుకు, పీస్ డీల్‌ను పాటించేందుకు ఇరాన్ అంగీకరించిన నేపథ్యంతో రెండు వారాల పాటు బాంబింగ్‌ను నిలిపివేస్తున్నట్టు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఇరాన్ ప్రతిపాదించిన పది పాయింట్ల ఫార్ములా వర్కవుట్ అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఇవీ ఇరాన్ ప్రతిపాదనలు
- దాడుల నిలిపివేతకు అంగీకారం.
- హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణకు అంగీకారం.
- యురేనియం శుద్ధి కార్యక్రమానికి ఆమోదించడం.
- ప్రాధమిక అంక్షలన్నీ ఎత్తివేయడం.
- అన్ని ద్వితీయ ఆంక్షల తొలగింపు.
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాల రద్దు.
- అన్ని బోర్డ్ అఫ్ గవర్నెన్స్ తీర్మానాల రద్దు.
- ఇరాన్‌కు నష్టపరిహారం చెల్లింపు.
- మధ్య ఆసియా ప్రాంతం నుంచి అమెరికా దళాల ఉపసంహరణ.
- లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధాన్ని నిలిపివేయటం.
ఈ ప్రణాళిక ఆచరణాత్మకంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. హార్మూజ్ జల సంధిని తెరవడం అనేది అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. ఇరాన్‌తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ గడువు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
వరల్డ్ పీస్ కు సీజ్ ఫైర్
సీజ్ ఫైర్ వరల్డ్ పీస్ కు గొప్ప రోజు అంటూ ట్రంప్ తన ట్రూత్ పోస్టులో రాసుకొచ్చారు.పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోందని, ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటుందని, ఇరాన్ కూడా ఇక యుద్దం వద్దని భావిస్తుందని రాసుకొచ్చారు. హర్మూజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్‌కు అమెరికా సాయం చేస్తుందని ట్రంప్ తెలిపారు. సానుకూల చర్యలు చేపట్టి వాణిజ్యపరంగా ముందడుగు వేసేందుకు సీజ్ ఫైర్ గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. ఇక ఇరాన్ వారి దేశాన్ని పునర్నిర్మించుకునే పనిని మొదలుపెట్టవచ్చని ..అందుకు అమెరికా సాయం చేస్తుందన్నారు. మా దేశం లాగానే ఇరాన్‌కు కూడా మంచి రోజులు రానున్నాయి అని ట్రంప్ పేర్కొన్నారు.
రెండు వారాల కాల్పుల విరమణకు ఓకే చెప్పిన ఇరాన్
అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరాన్ ఆ దేశానికి 10 ప్రతిపాదనలు పెట్టింది. హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగించడం, సాయుధ దళాల పర్యవేక్షణలో హర్మూజ్ నుంచి నౌకల రాకపోకలు సాగడం, అమెరికా విధించిన ప్రాథమిక ఆంక్షలు ఎత్తివేయడం, తమపై ఎలాంటి దురాక్రమణలకు పాల్పడకుండా ఉండటం వంటి 10 పాయింట్లను ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు కూడా సానుకూలంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరాన్ కూడా ఈ కాల్పుల విరమణకు అంగీకారంతెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చర్చల కోసమే ఈ కాల్పుల విరమణ అని స్పష్టం చేయడం విశేషం.
ఇంకా ట్రిగ్గర్ పైనే మా వేళ్లు : మొర్తాజా
కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా వెల్లడించింది. ‘ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రుదేశాలు ఏవిధంగానైనా దురాక్రమణకు పాల్పడితే.. పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తాం’ అని పేర్కొంది. తక్షణమే కాల్పులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను సుప్రీంనేత ఆదేశించినట్లు తెలిపింది.
ఇస్లామాబాద్‌లో వేదికగా చర్చలు
అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అమెరికా- ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ పిలుపునిచ్చారు. ఈనెల 10న ఇస్లామాబాద్‌కు రావాలని ఇరుదేశాల ప్రతినిధి బృందాలను ఆహ్వానించారు.పాక్ ప్రతిపాదనలపై వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి. ప్రత్యక్ష చర్చల గురించి సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొంది. అయితే, దీనిపై తుది నిర్ణయం అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటారని తెలిపింది.
లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదు: ఇజ్రాయెల్
అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ట్రంప్ నిర్ణయానికి మద్దతు ఇస్తామని. అయితే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని లెబనాన్ కు వర్తించదని స్పష్టం చేశారు. సీజ్ ఫైర్ ప్రకటన అనంతరం కూడా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తుంది.
అయితే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ఇజ్రాయెల్ ప్రకటనకు భిన్నంగా అమెరికా- ఇరాన్ అంగీకరించిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని పేర్కొనడంతో గందరగోళం నెలకొంది. తమ మిత్రదేశాలపై కూడా ఎలాంటి దాడులు చేయకూడదని ఇరాన్ ప్రతిపాదించిన తన 10 పాయింట్‌లలో పేర్కొంది. అయినప్పటికి లెబనాన్ పై ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
బీహార్‌లో ‘జాంబీ డ్రగ్’ ఎఫెక్ట్..బొమ్మలా మారిన యువకుడు!
రయ్ రయ్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram