Mattu Gulla | కిలో వంకాయ ధ‌ర రూ. 100కు పైనే..! ఎందుకంత డిమాండో తెలుసా..?

Mattu Gulla | కూర‌గాయ‌ల( Vegetables ) ధ‌ర‌లు ఆకాశ‌న్నాంటాయి.. అనే మాట‌ను ఎప్పుడూ ఏదో ఒక చోట త‌రచుగా వింటూనే ఉంటాం. నిత్యం వంట‌ల్లో వినియోగించే ట‌మాటా( Tomato ) నుంచి మొద‌లుకుంటే క‌రివేపాకు వ‌ర‌కు ధ‌ర‌లు పెరిగిపోతూనే ఉంటాయి. అయితే కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెరిగినా, త‌గ్గినా ఈ వంకాయ( Brinjal ) ధ‌ర మాత్రం ఎల్ల‌ప్పుడు రూ. 100కు త‌గ్గ‌దు. భౌగోళిక గుర్తింపు పొందిన ఆ మ‌ట్టుగుల్లా( Mattu Gulla ) వంకాయ‌ల‌ను రూ. 100 పైగానే విక్ర‌యిస్తున్నారు. ఆశ్చ‌ర్య‌పోకండి.. ఇది అక్ష‌రాలా నిజం.

  • By: raj |    agriculture |    Published on : Mar 22, 2026 8:00 AM IST
Mattu Gulla | కిలో వంకాయ ధ‌ర రూ. 100కు పైనే..! ఎందుకంత డిమాండో తెలుసా..?

Mattu Gulla | క‌ర్ణాట‌క( Karnataka ) తీర ప్రాంతంలోని ఉడుపి ప్రాంతంలో 500 ఏళ్ల క్రితం నాటి వంకాయ‌ను సాగు చేస్తున్నారు. ఆ వంకాయ( Brinjal ) పేరు మ‌ట్టుగుల్లా( Mattu Gulla ). ఈ వంకాయ ఎంతో రుచిక‌ర‌మైన‌ది కూడా. చాలా ఏండ్ల క్రితం ఈ వంకాయ కోసం గృహిణులు బారులు తీరేవారు. ఎందుకంటే ఆ వంకాయ కూర అంత రుచిగా ఉంటుంది కాబ‌ట్టి.

ఈ వంకాయ‌కు మ‌ట్టు గుల్లా అనే పేరు ఎలా వ‌చ్చింది..?

క‌ర్ణాట‌క ఉడుపి( Udupi ) ప్రాంతంలో పండించే ఈ వంకాయ‌కు మ‌ట్టు అనే పేరుతో ప్రాచుర్యం పొందింది. ఈ వంకాయ లైట్ గ్రీన్ క‌ల‌ర్‌లో ఉండి.. గ్లోసీ ప‌ర్పుల్ హైబ్రీడ్(glossy purple hybrids ) ర‌కానికి చెందిన‌ది. 16వ శ‌తాబ్దానికి చెందిన వాదిరాజ తీర్థ( Vadiraja Tirtha ) అనే సాధువు .. ఈ ప్రాంతంలోని రైతుల‌కు ఈ వంకాయ విత్త‌నాల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు వినికిడి. దీంతో ఆ వంకాయ విత్త‌నాల‌ను స్థానికులు త‌ర‌త‌రాలుగా త‌మ ఆధ్యాత్మిక జీవితంలో భాగం చేసుకున్నారు. ఇక ఈ పంట‌ను త‌మ సాంస్కృతిక పంట‌గా మార్చుకున్నారు.

పెద్ద ఎత్తున వంకాయ‌ల‌ను స‌మ‌ర్పించి..

ఇక సీజ‌న్‌లో వ‌చ్చే మొద‌టి వంకాయ పంట‌ను స్థానికంగా ఉన్న ఉడుపి శ్రీకృష్ణ మ‌ఠంలో స‌మ‌ర్పిస్తారు. ఆ త‌ర్వాత‌నే దాన్ని మార్కెట్‌లో విక్ర‌యిస్తుంటారు. ఇది ఆనాదిగా వ‌స్తుంది. ప్ర‌తి రెండేళ్ల‌కు ఒక‌సారి శ్రీకృష్ణ మ‌ఠంలో జ‌రిగే వేడుక‌ల‌కు కూడా రైతులు పెద్ద ఎత్తున వంకాయ‌ల‌ను స‌మ‌ర్పించి, త‌మ భ‌క్తిని చాటుకుంటారు. ఈ విధంగా శ‌తాబ్దాలుగా వ్య‌వ‌సాయాన్ని భ‌క్తిభావంతో చేయ‌డం అల‌వ‌రుచుకున్నారు.

సాంప్ర‌దాయ వంట‌గా వంకాయ‌

లేత ఆకుప‌చ్చ రంగులో గుండ్రంగా ఉంటుంది వంకాయ. ప‌లుచ‌ని తొక్క‌తో గుజ్జు అధికంగా ఉంటుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా తియ్య‌గా, కొద్దిగా ఘాటుగా ఉంటుంది. మొత్తానికి ఈ వంకాయ సాంప్ర‌దాయ వంట‌కంగా మారిపోయింది. సాంబార్, సాధార‌ణ వేపుడులో ఈ వంకాయ‌ను అధికంగా వినియోగిస్తారు.

ఈ రెండు న‌దుల మ‌ధ్య‌నే

ఈ పంట కేవ‌లం స్వ‌ర్ణ, ఉద్యావ‌ర న‌దుల మ‌ధ్య‌నే పండుతుంది. ఈ తీర ప్రాంతంలో ఇసుక నేల‌లు ఉండడంతో ఈ వంకాయ సాగుకు నేల అనువుగా ఉంటుంది. దీంతో దిగుబ‌డి కూడా అధికంగానే ఉంటుంది. అయితే ఈ విత్త‌నాల‌ను తీసుకెళ్లి వేరే ప్రాంతంలో నాటినా.. ఈ రుచి వాటికి ఉండ‌ద‌ట‌.

2011లో భౌగోళిక గుర్తింపు

ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ‌కు 2011లోనే భౌగోళిక గుర్తింపు(జీఐ ట్యాగ్) ల‌భించింది. మ‌ట్టు గుల్లా ఉడుపికి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త‌ను తీసుకొచ్చింది.

కిలో వంకాయ రూ. 100 పైనే

మట్టు గుల్లా అనే వంకాయ ధ‌ర సాధార‌ణంగా కిలో రూ. 70 వ‌ర‌కు ఉంటుంది. చాలా వ‌ర‌కు కిలో వంకాయ ధ‌ర రూ. 100 ప‌లుకుతుంది. స‌ర‌ఫ‌రా త‌క్కువ ఉన్న స‌మ‌యంలో గ‌రిష్ఠంగా రూ. 200 లేదా అంత‌కంటే ఎక్కువ కూడా చేరే అవ‌కాశం ఉంది. బెంగ‌ళూరు, ముంబై న‌గ‌రాల‌కు చెందిన వారు ఈ వంకాయ‌ను అధికంగా ఇష్ట‌ప‌డుతారు. ధ‌ర‌ను లెక్క చేయ‌కుండా కొనుగోలు చేసి.. రుచిని ఎంజాయ్ చేస్తారు.

300 ఎక‌రాల్లో సాగు

మ‌ట్టు గుల్లా వంకాయ ర‌కాన్ని స్థానిక రైతులు రెగ్యుల‌ర్‌గా సాగు చేస్తున్నారు. సుమారు 150 మంది రైతులు 300 ఎక‌రాల్లో సాగు చేస్తున్నారు. రైతు సంఘాలు కూడా త‌మ దేశీయ విత్త‌నాల‌ను భ‌విష్య‌త్ త‌రాల కోసం భ‌ద్రంగా దాచిపెడుతున్నాయి. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల దృష్ట్యా అప్పుడ‌ప్పుడు దిగుబ‌డి త‌గ్గుతుంది. అయిన‌ప్ప‌టికీ ఈ సాగును వ‌దిలేయ‌కుండా త‌మ సాంస్కృతిక వార‌స‌త్వ సంప‌ద‌గా ఈ వంకాయ సాగును చేస్తూనే ఉన్నారు.