అమరావతి: మొంథా తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. రోడ్లు, భవనాలశాఖకు రూ.2,079 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. తుపాను వల్ల ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని వెల్లడించారు. 120 పశువులు మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువే ఉందన్నారు. తుపాను నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నష్టం వివరాలను అధికారులు ఆయనకు వివరించారు.
ముందస్తు జాగ్రత్తలతోనే నష్ట నివారణ
మొంథా తుపాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని, అందుకే నష్టం తగ్గిందని చంద్రబాబు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని, ఇంటినీ జియోట్యాగింగ్ చేయగలిగామయని.. తుపాను వల్ల మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. గతంలో విద్యుత్ సరఫరా ఆగితే 10 గంటల వరకు వచ్చేది కాదు అని..ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఆగినా 3 గంటల్లోనే పునరుద్ధరణ జరిగిందని గుర్తు చేశారు. అధికార యంత్రాంగం అంతా నిబద్ధతతో పని చేశారు. చాలా సంతోషంగా ఉందన్నారు. ఓ వైపు వర్షం పడుతున్నా.. కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుండా చేశారని, గతంలో చెట్లు కూలితే.. తొలగించేందుకు వారం పట్టేదని..ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరు.. ముందస్తు చర్యల వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు అని పునరుద్ఘాటించారు.
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : పవన్ కల్యాణ్
‘మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46వేల హెక్టార్లలో నష్టం కలిగిందనీ చెప్పారు. ఈ జిల్లాలో దాదాపు 56 వేల మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సుమారు 274 కిలోమీటర్ల మేర రహదారులు తుపాను దాటికి దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుముందు చూపు కారణంగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, దీంతో తుపాన్ నష్టాలు గణనీయంగా తగ్గాయన్నారు. మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి 25 కేజీల బియ్యాన్ని, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, కేజీ పంచదార కూడా కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందే ఒక్కొక్కరికీ రూ. వెయ్యి చొప్పున ఇస్తున్నాం. ఒక్కో కుటుంబానికీ గరిష్టంగా రూ. 3 వేలు చెల్లించనున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.
