ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటికి నిరసన సెగ

విధాత : ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు టీడీపీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. ఖమ్మంలో బీఆరెస్ నాయకుడి ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరు అయ్యేందుకు ఖమ్మం వచ్చిన అంబటి రాంబాబు నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళగా సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు హోటల్ ముందు ఆందోళనకు దిగాయి.
చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ అంబటి రాంబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకొని అంబటి రాంబాబును అక్కడ నుంచి పంపించి వేశారు. అనంతరం అంబటి ఈ ఘటనపై స్పందిస్తూ ఖమ్మంలో నాపై ముందస్తు వ్యూహంతోనే టీడీపీ దాడికి పాల్పడిందని మండి పడ్డారు.