రాహుల్ యాత్రపై దాడులు దారుణం.. నిరసనలకు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల పిలుపు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ్ జోడో యాత్ర’పై అసోంలో జరిగిన దాడిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆమె

విధాత: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ్ జోడో యాత్ర’పై అసోంలో జరిగిన దాడిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆమె స్పందిస్తూ, జోడో యాత్రపై అతివాద బీజేపీ గూండాలు దాడికి తెగబడుతున్నాయన్నారు. అప్రతిహతంగా సాగిపోతున్న రాహుల్ యాత్రను ఆపార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని, దాడులు కూడా ఈక్రమంలోనివే అని అన్నారు. కోట్ల ప్రజల భారతీయుల హృదయాలను కలుపుతూ.. మరోవైపు వారిలో చైతన్యాన్ని నింపుతూ యాత్ర దూసుకుపోతున్నదని తెలిపారు. అసోంలో హేమంత్ బిస్వా అవినీతి, నిరంకుశ పాలన సాగుస్తున్నారని మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి నీచమైన కుట్రలకు, దుశ్చర్యలకు బీజేపీ నాయకులు తెగబడుతున్నారని, ఈ తరహా చర్యలకు స్వస్తి పలకాలని సూచించారు.
రాహుల్ యాత్రపై దాడికి నిరసనగా కాంగ్రెస్ ఆందోళనబాట పడుతున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకేంద్రాల్లోని మహాత్మాగాంధీ విగ్రహాల ఎదుట బైఠాయించి మౌనదీక్షలకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ జోడో యాత్రతో బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదని.. అందులో భాగంగా యాత్రను అడ్డుకునేందుకు ఆపార్టీ శ్రేణులను రెచ్చగొడుతోందని విమర్శించారు. దేశం ఐక్యత, ప్రజా శ్రేయస్సు కోసం చేసే ఈ పోరాటం.. బెదిరింపులకు లొంగదని షర్మిల స్పష్టం చేశారు. ఈ సిగ్గుమాలిన దాడులు తమ ధైర్యాన్ని, స్పూర్తిని దెబ్బతీయలేవని ఆమె ‘ఎక్స్’ వేదికగా అన్నారు.