మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ద్రోహం : సీఎం చంద్రబాబు

మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని ప్రతిపక్షాలు మహిళలకు ద్రోహం చేశాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మహిళా సాధికారతకు ఎన్డీఏ కట్టుబడి ఉందన్నారు.

అమరావతి : మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని ప్రతిపక్షాలు మహిళలకు ద్రోహం చేశాయని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలులో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. చట్టసభల్లో మహిళల కోసం రిజర్వేషన్లు తీసుకురావాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు పార్లమెంటులో అడ్డుకున్నాయని, రిజర్వేషన్ల బిల్లును ఓడించి మహిళల పట్ల ద్రోహానికి పాల్పడ్డాయని విమర్శించారు. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు అడ్డుకోకుండా ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది ఉండేదేదన్నారు. మహిళల ఓట్లు తీసుకుని 1996 నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ వారికి అన్యాయం చేస్తూనే ఉంది అన్నారు. ప్రజా చైతన్యం ద్వారా మహిళలకు రిజర్వేషన్ కల్పించే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుందని, చట్ట సభల్లో ఎక్కువ మంది మహిళల్ని చూడాలన్నదే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఓ తోక పార్టీ కూడా ఏపీలో మహిళలకు అన్యాయం చేసిందని, మహిళలకు అన్యాయం చేసిన పార్టీలకు మనుగడే ఉండదని హెచ్చరిస్తున్నానన్నారు.

దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయం నుంచి మహిళా రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం అన్నారు. నాలుగు దఫాలు ఈ బిల్లు తీసుకువచ్చారు. సభలో 2/3 మద్దతు అవసరం అవుతుందని, ఈ విషయంలో కాంగ్రెస్ వెనకడుగు వేసి మహిళలకు ద్రోహం చేసిందని విమర్శించారు. డీలిమిటేషన్ కూడా చేసుకుని మహిళలకు న్యాయం జరిగేలా చూడాల్సి ఉన్నా కాంగ్రెస్ దీనిని అడ్డుకుందని తప్పుబట్టారు. దక్షిణ, ఈశాన్య భారత్ కు నష్టం జరుగుతుందని ఏవేవో సాకులను ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి అని, ఇప్పుడున్న సీట్ల కంటే 50 శాతం సీట్లు పెరుగుతాయని ప్రధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా స్పష్టంగా చెప్పారు అని, అయినా బిల్లును అడ్డుకుని మహిళా రిజర్వేషన్లపై వ్యతిరేకతను మరోసారి కాంగ్రెస్ చాటుకుందని విమర్శించారు.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఆడబిడ్డలకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. మహిళా యూనివర్సిటీ పెట్టి విద్యోన్నతికి కృషి చేశారు అని, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం అని తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించేలా మహిళాభ్యున్నతికి మేం కృషి చేశాం అన్నారు.

ఇవి కూడా చదవండి :

భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోదీ
మహిళ బిల్లు ముసుగులో బీజేపీ కుట్ర రాజకీయం : సీఎం రేవంత్ రెడ్డి

Latest News