CM Chandrababu | నేర రహిత సమాజం.. స్థాపన: ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన

నేర రహిత సమాజం.. శాంతి భద్రతలలో నూతన అధ్యాయం లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని, ఇందుకు ప్రజా చైతన్య సదస్సులను కూడా నిర్వహిస్తామని ప్రకటించారు

CM Chandrababu | నేర రహిత సమాజం.. స్థాపన: ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన

నేర రహిత సమాజమే లక్ష్యం
శాంతిభద్రతల్లో కొత్త అధ్యాయమే ధ్యేయం
గంజాయి రహిత రాష్ట్రాన్ని నిర్మిస్తాం
వైసీపీ పాలనలో గాడితప్పిన లా అండ్‌ ఆర్డర్‌
నేరస్థుడే ప్రభుత్వాధినేత అయితే ఎలా ఉంటుందో ఐదేళ్ల పాలనే నిదర్శనం
ప్రభుత్వ హింసకు ఆయుధాల్లా పోలీసులు
ప్రతిపక్షాలను అణచివేశారు
ప్రశ్నించిన వారిని కేసుల పాలు చేశారు
వైసీపీ పాలనపై చంద్రబాబు ఆగ్రహం
ఐదేళ్ల పాలనలో శాంతిభద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల

విధాత : నేర రహిత సమాజం.. శాంతి భద్రతలలో నూతన అధ్యాయం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని, ఇందుకు ప్రజా చైతన్య సదస్సులను కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో శాంతిభద్రతలపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. మాజీ సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో శాంతిభద్రతల అధ్వాన్న పరిస్థితులను గణంకాలతో సహా వివరించిన చంద్రబాబు.. నేరస్థుడే ప్రభుత్వాధినేతగా వస్తే ఎలా ఉంటుందో గత ఐదేళ్ల పాలనే నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, ప్రభుత్వ హింసకు పోలీసులే ఆయుధాలుగా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు. 2019-2024 మధ్య ప్రభుత్వమే హింసను ప్రోత్సహించిందన్నారు. వారి పాలనను ప్రశ్నించిన వారందరిపై కేసులు, దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని ఆక్షేపించారు. చివరకు న్యాయమూర్తులనూ వదల్లేదని, సోషల్ మీడియా వేదికగా వారిపై అసభ్యకర పోస్టులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. జగన్ హెలికాప్టర్‌లో వెళ్లిన పరదాలు కట్టారు… చెట్లు కొట్టారని, దేవాలయాలపై దాడులు చేశారని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రకరకాల ట్విస్టులు ఇచ్చారన్నారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడారన్నారు. అంతర్వేదిలో రథాన్ని అంటించి కథలు చెప్పారని మండిపడ్డారు. రాముడి తల తీయడం, వెండి సింహాలు దొంగిలించడం వంటి ఘటనను ప్రస్తావించారు. బాబ్లీ కేసు తప్ప తనపై గతంలో మరో కేసు లేదని, కానీ తనపై 17కేసులు, పవన్ కల్యాణ్‌పై 7కేసులు మోపారని, విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ధర్నా చేసిన కేసులు పెట్టారని విమర్శించారు. మాట వినని పోలీసు అధికారులను వీఆర్‌ఎస్‌ ఇచ్చి పంపించారని ఆరోపించారు. కేసుల బనాయింపు బాధితుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, చింతమనేని, పులివర్తి నాని మొదటి మూడు స్థానాల్లో ఉన్నారని, పైల్స్కు శస్త్రచికిత్స చేయించకుని ఉన్న అచ్చంనాయుడిని 600 కిలోమీటర్లు తిప్పారన్నారు. కోడెలను అవమానించారని, శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు సమయంలో దుర్మార్గంగా ప్రవర్తించారన్నారు. మండలి చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవ పడ్డారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై దాదాపు 60కి పైగా కేసులు పెట్టారని, ప్రస్తుత హోంమంత్రి అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని, రఘురామకృష్ణరాజును లాకప్ చిత్రహింసలు పెట్టారని, దానికి సంబంధించిన వీడియోలు చూసి నాటి సీఎం పైశాచికానందం పొందారని చంద్రబాబు పేర్కోన్నారు. అమరావతి మహిళల బాత్‌రూమ్‌లపై డ్రోన్‌లు ఎగిరేశారని, మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ ను చంపారని, 4000 మంది సీపీఎస్‌ ఉద్యోగులపై కేసులు పెట్టారని, చివరకు టీచర్ల పైన కేసులు పెట్టి వేధించారని చంద్రబాబుల వివరించారు.

జగన్ అరాచక పాలనకు భిన్నమైన సుపరిపాలన అందిద్దాం

ప్రముఖ నేతులందరిపై కేసులు పెట్టారని, ప్రతిపక్షాలను అణిచివేశారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలలో అక్రమాలు, బోగస్ ఓటర్‌ కార్డులు తయారు చేశారని విమర్శించారు. స్థానిక ఎన్నికలు అన్నీ ఏకగ్రీవం చేసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కేంద్రం నుంచి రక్షణ కోరారని సీఎం తెలిపారు. కేసులు ఉన్న సభ్యులు ఓసారి లేవాలని సీఎం చంద్రబాబు కోరగా.. పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సహా చాలా మంది తమ స్థానాల్లో నిలుచున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు తన ప్రసంగం కొనసాగిస్తూ రాజకీయ పోరాటం చేసిన అందరిపైనా కేసులు పెట్టారన్నారు. ఎప్పటికీ బయటకు రానీయకూడదనుకున్నారని.. కానీ ప్రజలు తనను నేరుగా అసెంబ్లీ పంపించారని చెప్పారు. వారి పాలన ప్రజలు చూశారని.. ఇప్పుడు దానికి భిన్నంగా మనం ఉండాలని సుపరిపాలన అందించాలన్నారు. గతంలో టీడీపీ హయాంలో ఏపీలో మావోయిస్టులను చాలా వరకు నియంత్రించామని, మావోయిస్టులను, రౌడీలపై ఉక్కుపాదం మోపామని, పీడీ చట్టం ప్రయోగించామని తెలిపారు. సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలనే దృఢ సంకల్పంతో వెళ్లామని అన్నారు. గతంలో హైదరాబాద్‌లో మత ఘర్షణలను ఉక్కుపాదంతో అణచివేశామని, హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. నాగరిక ప్రపంచంలో వామపక్ష తీవ్రవాదం మంచిది కాదని చంద్రబాబు చెప్పారు. అందుకే గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో రౌడీ అనే పేరు వినబడకుండా చేశామన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏపీలో గత వైసీపీ ఐదేళ్ల పాలనలో శాంతిభద్రతలు తిరిగి అధ్వాన్నంగా మారాయన్నారు. గంజాయి లేని గల్లీ, గ్రామం లేదన్నారు. శాంతిభద్రతల గూర్చి ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ సీఎంగా ఐదేళ్లలో గంజాయిపై ఒక్క సమీక్ష చేయలేదన్నారు. రానున్న ఐదేళ్లలో ఏపీని గంజాయి రహిత, నేర రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. నేరస్థులు రాజకీయాల్లోకి రాజకీయ నాయకుల ముసుగువేసుకుని నేరాలకు పాల్పడే సంస్కృతిని పారద్రోలుతామన్నారు. తమ, పర బేధం లేకుండా తప్పు చేసిన వారిని శిక్షిస్తామన్నారు.