Balakrishna Vs Chiranjeevi బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి: అఖిల భారత చిరంజీవి యువత
అఖిల భారత చిరంజీవి యువత నందమూరి బాలకృష్ణను వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వ్యాఖ్యలు మెగా కుటుంబాన్ని బాధించాయని పేర్కొన్నారు.

విధాత: అసెంబ్లీ సాక్షగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత చిరంజీవి యువత ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా అనేక సార్లు అవమానకరంగా మాట్లాడటం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించామని తెలిపారు.
బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు అండగా నిలుచుందీ… ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి అహర్నిశలూ కృషి చేసింది మెగా కుటుంబమే అన్న విజ్ఞత మరిచి, అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ నేడు చట్టసభల్లో సైతం చిరంజీవి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవిని సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్ధమవుతోంది.
మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని విన్నవిస్తున్నాం. చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బాలకృష్ణ స్పందించి, బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల బాలకృష్ణ ప్రజాక్షేత్రం తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని అఖిల భారత చిరంజీవి యువత హెచ్చరించింది