రెండు రాజ్యసభ స్థానాలకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి పేర్లు ఖరారు!

తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు. రెండో సీటుపై కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య పోరు ఆసక్తికరం.

రెండు రాజ్యసభ స్థానాలకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి పేర్లు ఖరారు!

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుత తాజా మాజీ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ అభ్యర్ధిత్వాన్ని మరోసారి పునరుద్దరించారు. రెండో స్థానానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని..కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లుగా సమాచారం. రేపు గురువారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు.

రాష్ట్రం నుంచి రాజ్యసభ రెండో సీటు అభ్యర్థిత్వం కోసం వేం నరేందర్ రెడ్డితో పాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి టీ పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న బొమ్మాటి సాంబయ్య పేరును సీఎం రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్ ప్రతిపాదించారు. చర్చల అనంతరం చివరకు వేం నరేందర్ రెడ్డి పేరునే కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లుగా పార్టీ వర్గాల కథనం. మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ గాంధీభవన్ ముట్టడితో చేసిన ఒత్తిడిని కాంగ్రెస్ పట్టించుకోలేదు.

అయితే ఒక్కో రాజ్యసభ సీటు గెలవడానికి 40.66 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్య ఓట్లు అవసరం. అధికార కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు గెలవడానికి 82 మంది ఎమ్మెల్యేలు అవసరం. సీపీఐ ఎమ్మెల్యేతో కలిపి కాంగ్రెస్ బలం 67 మంది మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి 37మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ కూడా రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగితే రెండో సీటు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉత్కంఠ పోరు తప్పదు. అప్పుడు ఎంఐఎం సభ్యులు ఏడుగురు మద్దతునిచ్చినా… ఇంకా కాంగ్రెస్‌కు మరో 4గురు ఎమ్మెల్యేలు కావాలి. బీజేపీ ఓటింగ్ కు దూరంగా ఉంటే కాంగ్రెస్ గెలుపు లక్ష్యం నెరవేరుతుంది. అలాగే అనర్హత అభియోగాలు ఎదుర్కొంటున్న 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయం కూడా ఈ ఎన్నికలో కీలకంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో రాజ్యసభ స్థానం గెలుచుకునేందుకు ఏం చేయబోతున్నాయన్నది ఆసక్తి రేపుతున్నది.

ఇవి కూడా చదవండి :

Telangana Land Registration Revenue : తెలంగాణలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ల రాబడి!
యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులు : మంత్రి ఉత్తమ్