AP News | రాజధానికి భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు : సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిలో రూ.260 కోట్లతో చేపట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని టీటీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాజధానిలోని వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
విధాత, అమరావతి :
రాజధాని అమరావతిలో రూ.260 కోట్లతో చేపట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని టీటీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాజధానిలోని వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ పనులు రెండు దశల్లో పూర్తి కానున్నాయి. మొదటి దశలో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రూ.120 కోట్లతో రెండోదశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.
వేంకటేశ్వరుని కృపతోనే రాజధానికి అమరావతి నామకరణం
‘దేవతల రాజధాని అమరావతే.. మనకూ రాజధానిగా ఉంటుంది. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామీ ఆశీస్సులతో 2019లో అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాం. కృష్ణానది ఒడ్డున ఆలయం నిర్మించేందుకు 25 ఎకరాలను కేటాయించాం. రాజధానికి అమరావతి అనే నామకరణం కూడా ఆ స్వామి కృపతోనే జరిగింది. ఒక పవిత్ర కార్యం సంకల్పిస్తే దానికి ఇక్కడి ప్రజలు సహకరించారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన 29 వేల మంది రైతులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం తప్పా ఒక్కమంచి పనీ చేయలేదు. రైతులు మంచి సంకల్పంతో భూమి ఇస్తే ఐదేళ్లు వారికి నరకం చూపించారు. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులు న్యాయస్థానం అంటూ దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేశారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు, రైతులు, భక్తులు, పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram