ఎన్నికల్లో చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మరోసారి మోసం చేస్తున్నారని, బాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టినట్లేనని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు
విధాత : ఎన్నికల్లో చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మరోసారి మోసం చేస్తున్నారని, బాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టినట్లేనని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మాట్లాడారు. వైసీపీ అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే వైఎస్సార్ తిరిగి అధికారంలోకి రావాలని, చంద్రబాబుకు వేస్తే పథకాలు ముగింపు అవుతాయని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేని, పశుపతిని ఇంటికి తీసుకురావడమేనని హెచ్చరించారు. ఈ ఎన్నికలు తలరాతలు రాసే ఎన్నికలని, ప్రజలు ఆలోచించి మంచి చేసే పార్టీకి ఓటు వేయాలని కోరారు. మరోసారి మాట మీద నిలబడే మీ బిడ్డ జగన్ను ఆశీర్వదించాలని కోరారు. 2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఉదరగొడుతుందని, గతంలో రుణమాపీ అంటూ చంద్రబాబు రైతులను, డ్వాక్రా రుణాల పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణాలను మాఫీ చేయలేదని, ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశాడని, అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశాడని ఆరోపించారు. జన్మభూమి కమిటీల మీద నమ్మకం ఉంటే అధికారంలో వస్తే తిరిగి ధైర్యంగా పునరుద్దరిస్తావా లేదా అంటూ నిలదీశారు. వాలంటీర్ల వ్యవస్థను తిరిగి తీసుకొస్తానని జగన్ వెల్లడించారు.
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ లేదు
14 ఏండ్ల పాటు సీఎంగా పనిచేసినా చంద్రబాబు గుర్తుకు వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. పేదలకు ఏ ఒక్క మంచి పథకాలు లేవని ఆరోపించారు. రూ.3 వేల పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది. జగన్ అని, అమ్మబడి అంటే గుర్తుకొచ్చేది జగన్, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్ అని చెప్పుకొచ్చారు. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్, మహిళా సాధికారిత అంటి గుర్తుకొచ్చేది జగన్, సంక్షేమ పథకాలంటే పెదవాడికి గుర్తుకొచ్చేది జగన్. రైతన్నల చేయిపట్టుకుని నడిపించేది ఎవరెంటీ గుర్తుకొచ్చేది జగన్ అని పేర్కోన్నారు. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చామన్నారు.