విధాత, హైదరాబాద్ : తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వమే శాపంగా మారిందని..ఎల్ నినో కాదు అని..పలు ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా విడుదల చేయకుండా రైతులకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి జీ.జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్లు ఇస్తే కరెంట్ కొనాలని, పంటలు వేస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని, పంట కొంటే బోనస్ ఇవ్వాల్సి ఉంటుందని ఎల్ నినో పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదు అని జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతు పరిస్థితి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే దానికంటే ఎక్కువ అధ్వాన్నం అయిపోయిందని విమర్శించారు.
పోలవరం నుంచి పట్టిసీమ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయని..తెలంగాణలో మాత్రం గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేయడం లేదని అన్నారు.పెన్నా బేసిన్ లో వరద రాకున్నా రాయలసీమలో 52 శాతం వర్షపాతం తక్కువ ఉన్నా, మహబూబ్ నగర్ పరిధిలో ఉండే పంపులు ఇంతవరకు ఆన్ చెయ్యలేదు, ఈ ప్రభుత్వం గోదావరి , కృష్ణా బేసిన్ తెలంగాణ రైతులకు ద్రోహం చేస్తుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
నీళ్లున్నా..విడుదల చేయడం లేదు..
కన్నేపల్లి పంపులు ఆన్ చేసి ఉంటే మల్లన్న సాగర్ , కొండ పోచమ్మ , రంగనాయక సాగర్ నిండేవి అని, ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ కు క్షమాపణలు చెప్పి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రైతులకు నీళ్లు ఇస్తే పండిన పంటను చేతగాని రండ ప్రభుత్వం కొనలేకపోతే.. రైతులు బయట అమ్ముకుంటారు కదా అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నిండిన రైతులకు నీళ్ళు ఇయ్యమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పాడని, ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రి బయటపెట్టారని విమర్శించారు. ఆరుతడి పంటలు ఏం వేసుకోవాలో ఏ జిల్లాలో ఏం పంటలు పండుతాయిని మంత్రులు ఒక్కరంటే ఒక్కరు చెప్పినవారు లేరు అని, ఏ గింజ పెట్టుకోవాలన్న నీళ్ళు కావాలి, రైతులకు నీళ్ళు ఎలా ఇస్తారు… ఎప్పుడు ఇస్తారో రైతులకు చెప్పాలి కదా అని జగదీష్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సాగర్ లో 510అడుగుల వద్ద నీళ్లిచ్చాం..
నాగార్జున సాగర్ లో నీళ్ళు ఉన్నా, సాగర్ ఎడమ కాల్వ క్రింద ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వడం లేదని, ఎస్ఎల్బీసీ క్రింద నీళ్లు ఇవ్వడం లేదు అని దీంతో దేవరకొండ ప్రాంత రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. సాగర్ లో నీళ్లు ఉన్నాయో లేవో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ లో దూకితే తెలుస్తుందంటూ సెటైర్లు వేశారు. 518 అడుగుల నీళ్ళు ఉన్నప్పడే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇచ్చిందని, 510 అడుగుల నీళ్ళు ఉన్నప్పుడే కేసీఆర్ ఎడమ కాల్వ క్రింద సాగునీరు ఇచ్చారని పేర్కొన్నారు. ఇవ్వాళ 532 అడుగులు వున్నకూడా రైతులకి నీళ్ళు ఇవ్వం అని మంత్రులు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఎల్ నినో టైంలో రైతులకు పంట పండించుకునే అవకాశం ఇస్తే… ఓపెన్ మార్కెట్ లో పంటకు డిమాండ్ ఉండేది కదా అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాళేశ్వరంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నాటకం తేటతెల్లం
కాళేశ్వరంలో మేడిగడ్డ ఏడో బ్లాక్ మినహా మిగతా బ్యారేజీ సహా అన్నారం, సుందిళ్ల అన్ని కూడా బాగానే ఉన్నాయని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ (సెంటర్ ఫర్ వాటల్, పవర్ రీసెర్చ్ స్టేషన్) నివేదికతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ కలిసి ఆడిన నాటకం ద్రోహం ఇప్పుడు తేట తెల్లం అయిందని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా కన్నేపల్లి పంపు హౌస్ ఆన్ చెయ్యండని కేటీఆర్ అనేక సార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు అని, చెప్పిన అబద్ధమే చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సాకు చెప్పింది అని, కమిషన్ లకు అలవాటు పడ్డ ఈ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదు అని విమర్శించారు.
పోతిరెడ్డి పాడు నుంచి అక్రమ తరలింపుతోనే నాగార్జున సాగర్ నిండలేదు..
పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఏ విధంగా దోచుకుంటున్నారో వాస్తవాలు ప్రజలకు చూయించానని, రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోతిరెడ్డిపాడు బొక్కతో అంతులేకుండా నీళ్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తుందని, పోతిరెడ్డిపాడు నుంచి వరద జలాలను మాత్రమే తీసుకొని పోవాలని, ఆంధ్రప్రదేశ్ అక్రమంగా 140 టీఎంసీల నీటిని తరలించినా.. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉన్నారని, అక్రమంగా ఏపీ నీళ్లు తరలించడంతో నాగార్జున సాగర్ ఇప్పటికి నిండడం లేదు అన్నారు. సాగర్ లో ఇప్పటివరకు 175టీఎంసీల నీళ్ళు ఉన్నాయి అని, 110టీఎంసీల నీళ్ళు వచ్చి ఉంటే సాగర్ నిండేదని అన్నారు. నాగార్జున సాగర్ లో ఎడమ కాల్వ క్రింద ఉండే పంటలకు సరిపడే నీళ్ళు ఉండేవని అన్నారు.
భూభారతి సమస్యలతోనే సీఎం, మంత్రుల మధ్య రచ్చ
భూ భారతితో వచ్చిన సంక్షోభమే ముఖ్యమంత్రి మంత్రుల మధ్య పంచాయతీ అని, మంత్రుల పంచాయతీపై మీడియా మిత్రులు చర్చించుకుంటున్నట్లే..కాంగ్రెస్ పార్టీలో ఉండే వారు చర్చ చేస్తున్నారు అని,నిషేధిత జాబితాలో కొందరి ఎమ్మెల్యేల భూములు ఉన్నాయని, ముఖ్యమంత్రి , ఇద్దరు మంత్రులు సొంత పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కొట్లాట ఇస్తారాకుల దగ్గర కుక్కలు కోట్లాడుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. వాళ్ళల్లో వాళ్ళే దొంగల లెక్క కొట్లాడుతున్నారని అన్నారు. చిన్నారెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడ ప్రస్తుత వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కోట్ల రూపాయలు పెట్టీ టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుద్ రెడ్డి, మదన్ మోహన్ లాంటి వారు కూడా సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేశారు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో సంక్షోభానికి బీఆర్ఎస్, వైసీపీలల కుట్ర ఉందని కొందరు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని, ఇంకా నయం ట్రంప్ ,పుతిన్ లాంటి వాళ్ళ కుట్ర ఉందని అనలేదు అని సెటైర్లు వేశారు.
లండన్ లో కేటీఆర్, హరీశ్ రావు, రేవంత్ రెడ్డిలు ఎంఐఎం మధ్యవర్తిత్వంతో కలిశారని చెబుతున్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాటలు నిజమైతే, సీబీఐ, రా సంస్థలు కేంద్రం చేతిలోనే ఉన్నాయని, వారి కలిసిన ఫోటోలు బయట పెట్టొచ్చు కదా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. రేపు బీఆర్ఎస్ గెలవబోతుందని అందరికి తెలుసు కాబట్టే కొత్త డ్రామాకు తెరలేపారని, దీనిపై కేసీఆర్, కేటీఆర్ కూర్చొని ప్రభుత్వ ద్రోహంపై ప్రత్యేక కార్యచరణకు ప్లాన్ చేస్తాం అన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ,మాజీ ఎమ్మెల్యేలు ఎన్ .భాస్కర్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , గాదరి కిషోర్ కుమార్ , పైళ్ళ శేఖర్ రెడ్డి, నోముల భగత్ పాల్గొన్నారు.
