CR Patil letter to Revanth Reddy | బనకచర్లపై మీ అభ్యంతరాలు అందాయి: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం లేఖ

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు తమకు అందినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆరు రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

CR Patil letter to Revanth Reddy | బనకచర్లపై మీ అభ్యంతరాలు అందాయి: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం లేఖ

న్యూఢిల్లీ : గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలు తమకు అందినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రీ-ఫీజిబిలిటీ నివేదికను పరిశీలిస్తున్నామని, ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్య నివేదిక పరిశీలనలో ఉన్నట్లు లేఖలో కేంద్ర మంత్రి వెల్లడించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతోనూ చర్చించి.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి పాటిల్ లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖను కేంద్ర మంత్రి సెప్టెంబర్ 23న రాయడం గమనార్హం. ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన ఏమిటన్నది వెల్లడి కావాల్సి ఉంది.

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను ఇప్పటికే కేంద్రం వద్ద వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే వృధా జలాల ఆధారంగానే తాము బనచర్ల ప్రాజెక్టు కడుతామంటూ ఏపీ వాదిస్తుంది. కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం పట్టుదలగా ముందుకెలుతున్నారు. ఇటు తెలంగాణ నది జలాల హక్కులకు బనకచర్ల గండి కొట్టేదిగా ఉన్నందునా తెలంగాణలోని రాజకీయ పక్షాలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.