ఒకప్పుడు రతనాల సీమగా పేరొందిన కరువు సీమ రాయలసీమ మళ్లీ పూర్వ నామాన్ని సార్థకం చేసుకునే దిశగా పురోగమిస్తుంది. విలువైన ఖనిజ నిక్షేపాలకు నెలవైన రాయలసీమలో ఇటీవల జొన్నగిరి గోల్డ్ మైన్స్ బంగారం ఉత్పత్తి ప్రారంభిచుకోవడం తెలిసిందే. ఇదే ఊపులో కొత్తగా కుప్పంతో పాటు, తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలోని జౌకల, రామగిరి ప్రాంతాల్లోనూ బంగారం నిక్షేపాలు వెలికితీసే పనులను చంద్రబాబు ప్రభుత్వం ముందుకు దూకిస్తుంది.
కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ‘చిగరుగుంట–-బిసనత్తమ్’ మధ్య కేంద్రం గుర్తించిన బంగారు నిక్షేపాల వెలికితీతకు బిడ్డింగ్ ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుంది. కర్ణాటక కోలార్ బంగారు గనులకు సమీపంలో చిగురుగుంట–బిసానత్తం ప్రాంతంలో 272.987 హెక్టార్ల పరిధిలో సుమారు 18 లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఒక టన్ను ముడి ఖనిజం నుంచి సగటున 5.5 గ్రాముల బంగారం లభించే అవకాశముండగా.. మొత్తం 8.5 టన్నుల బంగారం వెలికితీయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్తగా సత్యసాయి జిల్లాలో బంగారు గనులు
కరువు పీడిత సత్యసాయి జిల్లాలోని ఎన్పీకుంట మండలం జౌకల, రామగిరి ప్రాంతంలో ఖనిజాన్వేషణ ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయించింది. ఇక్కడ 2022లో జీ4 దశ అన్వేషణ నిలిచిపోవడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జీ4 దశ అన్వేషణను ముందుకు తీసుకెళ్తోంది. మొత్తం ఆరు బ్లాకుల్లో నాలుగు దశల్లో పరిశోధనలు జరగనున్నాయి. ఆరు ప్రైవేట్ ఏజెన్సీలు ఈ పనులను చేపట్టి నివేదిక సమర్పించనున్నాయి. జౌకల వెలిగల్లు గ్రీన్‌స్టోన్ బెల్ట్‌లోని కొత్తపల్లి బ్లాక్‌తో సహా 5,560 హెక్టార్లలో విస్తృత అన్వేషణ జరగనుంది. 2001లోనే ఇక్కడ 240 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక అన్వేషణ జరిపారు. మెస్సార్స్ జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఖనిజాన్వేషన లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పట్లో ఆ ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయింది.
2015లో మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్ జౌకల ప్రాంతంలో పరిశోధనలు చేపట్టి బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించింది. తాజా పరిశోధనలు పూర్తి కాగానే బంగారు నిక్షేపాల స్థాయి, నాణ్యతపై స్పష్టత వచ్చాక మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఈ ప్రాంతం కర్ణాటకలోని కోలార్ గ్రీన్‌స్టోన్ బెల్ట్‌ను పోలి ఉండటంతో బంగారం నిక్షేపాలపై నిపుణులు ధీమాగా ఉన్నారు. జౌకల, రామగిరి, రొద్దం మండలం బొక్సంపల్లిలోనూ బంగారు నిక్షేపాలు పెద్దమొత్తంలో ఉన్నాయని , సర్వే పూర్తయ్యాక వేలం ద్వారా వాటన్నింటిని మైనింగ్ కు ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మల్లయ్య కొండల్లో మైనింగ్ పై అభ్యంతరాలు!
రాయలసీమలో బంగారం సహా విలువైన అరుదైన ఖనిజాన్వేషణపై దూకుడుగా ముందుకెలుతున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్య కొండల్లో మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పర్యావరణ వేత్తలు, ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్య కొండల సముదాయంలోని సాధుకొండ, శివపురం, ఎర్రకొండల్లో మైనింగ్ కోసం ఏపీఎండీసీకి సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి అనుమతినివ్వడం వివాదస్పదమైంది. తిరుమలకు ఏడు కొండల్లాగే మల్లయ్యకు ఇక్కడ మూడు కొండలు పవిత్రమైనవిగా భావిస్తుంటారు. అలాంటి మల్లయ్య పవిత్ర కొండల్లో ఐరన్ ఓర్ తవ్వకాలకు అనుమతివ్వడంపై స్థానికులు, భక్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6,700 హెక్టార్ల రిజర్వు ఫారెస్టులో మైనింగ్‌పై పర్యావరణవేత్తలు, వైసీపీ నేతలు అభ్యంతరాలు తెలుపుతున్నారు. అయితే మల్లయ్య కొండల్లో మైనింగ్ కు తము ప్రభుత్వం ఎలాంటి అనుమతులివ్వలేదంటూ టీడీపీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ, టీడీపీ మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి.
