విధాత, హైదరాబాద్ : |ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో జూన్ నెలల్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిపించారు. రెండోసారి సోమవారం నుంచి పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండడంతో మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి, అక్టోబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ నజీర్ శాసనసభ, మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశానికి సభ్యులను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆహ్వానించానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఐదు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. 23వ తేదీన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గత వైసీపీ పాలన తీరుపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు మరో మూడు పత్రాలను అసెంబ్లీ సమావేశంలో విడుదల చేయనున్నారు. శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తుతో ఉన్న కండువాలతో పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అటు వైసీపీ పార్టీ నుంచి ఈ సమావేశాల్లో తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఎండగట్టాలన్న నిర్ణయించారు. ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. శాసనసభ సమావేశాలకు మొదటిరోజు హాజరై.. ఆ తర్వాత నుంచి సభకు డుమ్మాకొట్టాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని, ఢిల్లీలో ధర్నా, నిరసనల పేరుతో సమావేశాలకు హాజరుకాకూడదని జగన్ నిర్ణయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ శ్రేణులపై దాడులకు నిరసనగా సనసభ సమావేశాలను బహిష్కరించే ప్లాన్‌లో వైసీపీ అధినేత ఉన్నారన్న చర్చ వినిపిస్తుంది.
Andrapradesh | సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు .. జగన్ హాజరుపై ఆసక్తి
