శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్

కేఆర్ఎంబీ చైర్మన్ శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించి భద్రత, గేట్లు, ప్లంజ్ పూల్, నీటి నిల్వలపై ఏపీ-తెలంగాణ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

విధాత : కేఆర్ఎంబీ చైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించారు. జలాశయం రోప్స్, గేట్స్, గ్యాలరీ, ప్లంజ్ పూల్, అప్రోచ్ రోడ్ల స్థితిగతులు, నీటి నిల్వలను పరిశీలించారు. శ్రీశైలం జలాశయ నమూనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. జలాశయం పరిశీలన అనంతరం ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలాశయ నిర్వహణ, భద్రతా చర్యలు, నీటి నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం. కృష్ణా నది పరివాహక ప్రాజెక్టులను ఆయన రెండు రోజుల పర్యటన సందర్బంగా పరిశీలించనున్నారు.

శ్రీశైలం జలాశయాన్ని ఇదే నెలలో సీడబ్ల్యుసీ డ్యామ్ సేఫ్టీ టెక్నికల్ కమిటీ సభ్యులు పరిశీలించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) బృందం సైతం గత ఏడాది ఏప్రిల్ లో శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించి ఇప్పటికే తక్షణ మరమ్మతులు చేట్టాలని నివేదించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా డ్యామ్ భద్రతకు ముప్పుగా మారిన స్పిల్‌వే దిగువన ‘ప్లంజ్ పూల్’ పై ఆందోళన వ్యక్తం చేసింది. స్పిల్‌వే దిగువన 120-160 మీటర్ల లోతైన, భారీ గోతిని ఎన్డీఎస్ఏ బృందం గుర్తించింది. ఇది డ్యామ్ పునాదులకు ముప్పు కలిగిస్తోందని హెచ్చరించింది. మే 2025లో సమర్పించిన నివేదికలో తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల ఆవశ్యకతను నొక్కి చెప్పింది. డ్యామ్ దిగువన రాతిపలకల స్థిరత్వాన్ని పెంచడానికి, కాఫర్ డ్యామ్ నిర్మించి, అత్యాధునిక సాంకేతికతతో మరమ్మతులు చేపట్టాలని సూచించింది.

తాజాగా శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించిన సీడబ్ల్యుసీ డ్యామ్ సేఫ్టీ టెక్నికల్ కమిటీ సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికను అందించనుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ మరమ్మతులు, నిర్వహణపై సీడబ్ల్యుుసీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

ప్రస్టేషన్ తోనే కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు : మంత్రి వెంకట్ రెడ్డి
తెలంగాణ రాహు కేతువులు రేవంత్, కేసీఆర్ లు: బండి సంజయ్

Latest News