అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో శ్రీరాముడి పంచలోహ విగ్రహం లభ్యమైంది. కృష్ణా నదిలో స్నానం చేయడానికి దిగిన వారికి ఈ విగ్రహం లభించింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా అధికారులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ విగ్రహం ఏ కాలానికి చెందినది అనే అంశంపై పురావస్తు శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
గతంలో ఇదే గ్రామంలో లక్ష్మీదేవి పంచలోహ విగ్రహం లభ్యమైంది. గ్రామస్థులు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆ విగ్రహాన్ని అందించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన గుడిమెట్ల గ్రామం ఒకప్పుడు రాజులు పరిపాలించిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఏడు కోటలు, ఏడు పేటలతో 11వ శతాబ్దంలో రాజధానిగా ఈ గ్రామం విరాజిల్లింది. గతంలో లక్ష్మీదేవి, తాజాగా శ్రీరాముడి విగ్రహం లభించడంతో గుడిమెట్ల గ్రామాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
అభినవ షాజహాన్..భార్యకు తాజమహల్ భవనం!
హైదరాబాద్ మెట్రో రైల్ తెలంగాణ ప్రభుత్వ పరం.. ఎల్అండ్‌టీతో ఒప్పందం పూర్తి
