మెగా బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి !

ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మెగా బ్రదర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సోదరుడు జనసేన కీలక నేత ఎమ్మెల్సీ కొణదెల నాగబాబుకు ఏపీ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. నాగబాబును రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పదవి రేసులో ఉన్న నాగబాబుకు గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌ పదవిలో నియమించడం ఓ రకంగా జనసైనికులను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ చైర్మన్ పదవికి కూడా కేబినెట్ హోదా ఉండటం కొంత వారికి ఊరటనిచ్చినట్లయ్యింది. గమ్మత్తుగా అన్న నాగబాబుకు కేటాయించిన గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ తమ్ముడు పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో ఉన్న అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోనిదే కావడం విశేషం.

నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని ఇప్పటిదాక విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే వివిధ రాజకీయ సమీకరణాలు, సామాజిక-ప్రాంతీయ సమతుల్యత కారణంగా ఆ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 9-12-2024న టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఒక ప్రకటన కూడా చేశారు. దీంతో నాగబాబుకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం మరింత బలపడింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాతా ఆయన కేబినెట్ ఎంట్రీ ఖాయమని అంతా అనుకున్నారు. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఒక్క ఖాళీ ఉంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ చర్చ మరోసారి మొదలవ్వడంతో పాటు కూటమిలో జనసేనకు మరో బెర్త్ కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో మరోసారి మంత్రి పదవి రేసులో నాగబాబు పేరు ముందుకు వచ్చింది.

ప్రస్తుతం జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేశ్‌, నాదెండ్ల మనోహర్‌ మంత్రి పదవుల్లో ఉన్నారు. వీరిలో పవన్‌, కందుల దుర్గేశ్‌ ఇద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారే అవుతారన్న విశ్లేషణల పర్వం.. చివరకు మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీకి బ్రేక్ వేసింది. తాజాగా నాగబాబుకు గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌ పదవి కట్టబెట్టడంతో ఇక ఆయన మంత్రి వర్గం రేసులో ప్రస్తుతానికి లేనట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Latest News