విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనలో గాయపడి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు.ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోవడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. ప్రమాదంపై విచారణ జరుగుతుందన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. రిటైర్‌మెంట్ పరిధి వరకు స్టీల్‌ప్లాంట్ క్వార్టర్స్‌లోనే ఉండొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లు ఉన్నారు.
మంత్రులు నారా లోకేశ్, అనితల పరామర్శ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంమంత్రి అనిత తదితరులతో కలిసి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
