Bollineni Krishnaiah | శ్రీనివాస్ ‘శ్రీమాలిక’ పరిమళాల మధ్య.. ఘనంగా కృష్ణయ్య జన్మదినం

  • By: TAAZ    news    May 25, 2025 8:35 PM IST
Bollineni Krishnaiah | శ్రీనివాస్ ‘శ్రీమాలిక’ పరిమళాల మధ్య.. ఘనంగా కృష్ణయ్య జన్మదినం

భారతీయ నాగరికతలకు మూలమైన సంస్కృతిని, సంస్కృత భాషలోనున్న శాస్త్రాలని సంరక్షించుకోకపోతే రేపటి తరాలకు బలమైన పవిత్ర జీవన విధానం ఇవ్వలేమని కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య అన్నారు. వేద వేదాంగపారంగతులైన బ్రహ్మవేత్తల వైదిక మంత్రాలమధ్య మణికొండలోని స్పటికలింగేశ్వరునికి బొల్లినేని కృష్ణయ్య తన జన్మదినోత్సవ సందర్భంగా శతరుద్రీయ మంత్రాలతో మహారుద్రాభిషేకం తదితర మన్యుసూక్త ఏకాదశ పారాయణాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, భగవంతుని ఎదుట కూర్చుని చేసే ప్రార్ధన, స్మరణ హృదయపూర్వకమై వున్నప్పుడే సాధన ఫలిస్తుందని వివరిస్తూ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనం శ్రీమాలిక అపురూప గ్రంధాన్ని ఇటీవల తాను శ్రీశైల క్షేత్రంలో ఎంతోమందికి బహూకరించినప్పుడు వచ్చిన స్పందన అనూహ్యమని, ఇది శ్రీనివాస్ స్వయంప్రతిభపై భగవంతుని మహాబలం అనుగ్రహమై వర్షించడమేనన్నారు.

ఈ సందర్భంగా పలువురు అర్చకులకు, వేదపండితులకు కృష్ణయ్య శ్రీమాలిక బహూకరించారు. ఈ సందర్భంలో వేద విద్యల, శ్రీవిద్యల మంత్రాలతో బొల్లినేని కృష్ణయ్యను మహోపాసకులైన వేదపండితులు శతమానంభవతి అంటూ ఆశీర్వదించిన వైదిక విధానం ప్రత్యేక విశేషంగానే పేర్కొనాలి. ఇప్పటికే యాదాద్రి, వెంకటాద్రి, ఇంద్రకీలాద్రి మహాపుణ్యక్షేత్రాలలో వేల వేల భక్తులను ఆకట్టుకున్న పురాణపండ నాలుగు ప్రధాన పవిత్ర గ్రంధాలకు కిమ్స్ చైర్మన్ కృష్ణయ్య సమర్పకులు కావడం దైవఘటనేనని మేధో సమాజం కోడై కూస్తోంది.

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ శ్రీమాలిక గ్రంధం ఇప్పటికి పదహారు పునర్ముద్రణలకు నోచుకోవడం ఈ రోజుల్లో ఆషామాషీ వ్యవహారంకాదని, శ్రీనివాస్ నిరంతర కృషీవలత్వాన్ని కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతి శ్రీమాలిక ఆవిష్కరణ సందర్భంలో మంగళాశాసనం చెయ్యడం కూడా శ్రీనివాస్ జీవన యాత్రలో ఒక మేలిమలుపుగా చెప్పాల్సిందే! మొదట నూట అరవై పేజీలతో భక్త పాఠకులను ఆకట్టుకున్న శ్రీమాలిక గ్రంధం ఇప్పుడు నాలుగు వందల పేజీలతో అద్భుత ఆర్షభారతీయ విశేషాలతో ఆకర్షిస్తోందని ఇటీవల భారతమాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, తెలంగాణా శాసనమండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి ప్రశంసించడం గమనార్హం.