ఏపీ సచివాలయం ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు
ఏపీ సచివాలయంలోని ఐటీ విభాగంలో కీలక డేటా, ఫైల్స్ అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బుధవారం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు.

మంత్రుల చాంబర్లను స్వాధీనం చేసుకున్న జీఏడి
విధాత : ఏపీ సచివాలయంలోని ఐటీ విభాగంలో కీలక డేటా, ఫైల్స్ అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బుధవారం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్‌లను, ఇతర ఉపకరణాలను తనిఖీ చేశారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ల నుంచి డేటా తస్కరణకు, డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారుల తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్‌లు, డేటా హార్డ్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు రావడంతో పోలీసులు తనిఖీలు చేశారని ఐటీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా సచివాలయంలో మంత్రుల ఛాంబర్ల ను జీఏడీ స్వాధీనం చేసుకునే పనులు చేపట్టింది. మంత్రుల పేషీలకు ఉన్న బోర్డులను తీసేయించారు. పాత మంత్రుల సిబ్బంది చాంబర్‌లలోని ఫర్నిచర్, కంప్యూటర్ వివరాలను జీఏడీలో అందచేశారు. ఎల్లుండిలోగా మంత్రుల పేషీల స్వాధీన ప్రక్రియను పూర్తి చేయాలని జీఏడి ఆదేశించింది.