సీఎం చంద్రబాబును మెప్పించింది..ఇంతలోనే విద్యార్థిని ఆత్మహత్య

తల్లికి వందనం కార్యక్రమంలో సీఎం చంద్రబాబును తన మాటలతో ఆకట్టుకున్న పదో తరగతి విద్యార్థిని శివాని రెండు రోజులకే ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం కలిగించింది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తల్లికి వందనం కార్యక్రమంలో రెండు రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబునే తన మాటలతో మురిపించి మెప్పించిన ఓ విద్యార్థిని ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడటం అందరిని కలిచివేసింది. రంపచోడవరం మండలంలోని ఇర్లపల్లి కొత్త కాలనీలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివాని ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదం రేపింది. రేకుల షెడ్‌లో ఉరి వేసుకుని శివానీ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శివానీ రాసిన సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శివానీ తన సూసైట్ నోట్ లో రాసిన అంశాలు అందరిని కంట తడి పెట్టిస్తున్నాయి. “సారీ అమ్మా.. నాకోసం చాలా కష్టపడ్డావ్. డాడీ.. నీ కల నెరవేర్చలేకపోతున్నా. నా డ్రీమ్ కూడా ఫుల్ ఫిల్ చేయలేకపోతున్నా. అమ్మా నాన్న నాకు బ్రతకాలని ఉంది కానీ.. బ్రతకడానికి చాలా రిగ్రేట్ గా ఉంది. చాలా గిల్టీగా కూడా ఉంది. అమ్మ నీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నా. నేను చనిపోయాక నాపై కోప్పడకండి నాన్న. మీ ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మా.. మీరు ఇప్పటికైనా కలవండి. ద్వేషించుకోకండి. అన్నయ్య ఇకనైనా నాన్న మాట విని బాగుపడు.. చెడ్డపనులు చేయకు.” అని శివానీ సూసైడ్ నోట్ లో పేర్కొంది.

ఈనెల 24న రంప‌చోడ‌వ‌రంలో తల్లికి వందనం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని శివానీ వేదిక నుంచి మాట్లాడింది. ఆపై చంద్రబాబుతో ముచ్చటించి ఆయనతో ఫొటో కూడా దిగింది. భవిష్యత్తులో తాను షైనింగ్ స్టార్ ను అవుతానంటూ చంద్రబాబుతో చెప్పని శీవానీ ఇలా రెండు రోజులు కూడా గడువకముందే అనూహ్యంగా అర్థాంతరంగా జీవితాన్ని ముగించడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శివాని మృతితో పాఠశాల ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Latest News