Tadipatri | తాడిపత్రిని తాకిన రప్పా రప్పా.. పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాది తర్వాత పెద్దిరెడ్డి హఠాత్తుగా తాడిపత్రి పట్టణంలోకి రావడంతో పోలీసులను సైతం ఉలిక్కిపడేలా చేసింది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికి పోలీసుల అనుమతించకపోవడంతో వారిపై కోర్టు ధిక్కార పిటీషన్ ఇప్పటికే దాఖలు చేశారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పెద్దిరెడ్డి ఆదివారం తన సొంత ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. తాడిపత్రికి పెద్దారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గొడవలకు దిగే అవకాశముండటంతో సమాచారం అందుకున్న పోలీసులు పెద్దారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను అరెస్టు చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి అనంతపురం తరలించారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
ఎన్నిసార్లు అడ్డుకున్నా.. తాడిపత్రిలో అడుగుపెట్టి తీరుతా: కేతిరెడ్డి పెద్దారెడ్డి
ఏడాది తర్వాతా సొంతింటిలో అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాని..తాడిపత్రి పోలీస్ వ్యవస్థ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తుందన్నారు. మా పార్టీ నాయకులను పోలీసులు కొట్టి ఆ ఫోటోలను ప్రభాకర్ రెడ్డికి పంపిస్తున్నారన్నారు. పార్టీ కార్యక్రమాలు చేయకుండా ఏడాది కాలంగా నియోజవర్గానికి దూరంగా ఉన్నానని..తాడిపత్రి పట్టణానికి వెళ్లిన గంటలోపే పోలీసులు నన్ను అరెస్టు చేసి బయటకు పంపించేశారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టుకొని మావాళ్లను బెదిరించాలని చూస్తున్నాడన్నారు. ప్రభాకర్ రెడ్డితో యుద్ధానికైనా, రాజకీయానికైనా సిద్ధంగా ఉన్నానని పెద్ధిరెడ్డి ప్రకటించారు. నా ఇంటి నిర్మాణం అంతా సక్రమంగానే జరిగింది అని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు.
పెద్దారెడ్డి.. నీ ఇంటిని మా కార్యకర్తలు రప్పా రప్పా చేస్తారు: జేసీ ప్రభాకర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట తిరగొద్దంటూ వైసీపీ కార్యకర్తలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పెద్దిరెడ్డి తాడిపత్రి పట్టణానికి దొంగ చాటున వచ్చాడని..దొరతనంగా ఎప్పుడు రాలేదన్నారు. వెంట ఎవరెవరో ఉన్నారో ఫోటోలతో నాకు తెలిసిపోతుందన్నారు. అయితే, నాకు వైసీపీ పార్టీ కార్యకర్తలు శత్రువులు కాదని.. మా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే అన్నారు. అతడి వెంట ఎవరు వెళ్లిన వారి భరతం పడతానని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మాపై అనేక కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశాడన్నారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎప్పుడు అడుగు పెట్టిన రానివ్వకుండా అడ్డుకుంటానని తెలిపారు. 4 రోజులు నేను ఊరిలో లేకుండ వెళ్తున్నానని.. మా టీడీపీ కార్యకర్తలు మీ ఇంటిని రప్పా రప్పా చేస్తారని పేర్కొన్నారు. మేము వైసీపీ కార్యకర్తలను ఇప్పటి వరకు ఏమీ అనలేదు.. కానీ, రేపటి నుంచి పెద్దారెడ్డి ఇంటి దగ్గర.. వైసీపీ కార్యకర్తల ఇంటి ముందు.. మా కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.