బూటకపు జల వివాదంతో రాజకీయ లబ్ది కోసం ఆరాటం
విధాత,తెనాలి:ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్యలు చూస్తుంటే నేను కొట్టిన్నట్లుండాలి, నువ్వు ఏడ్చినట్లుండాలి, ప్రజలు మనల్ని నమ్మాలి, చివరకు రాజకీయ లబ్ది చేకూరాలి అన్న చందంగా ఉందన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా ఏపీ మంత్రులకు మాత్రం నోరు మెదపలేకపోతున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టానుసారంగా నోరేసుకొని పడే అధికారపక్షం మంత్రులు, ఎమ్మెల్యేలకు పక్క రాష్ట్ర మంత్రులకు సమాధానం చెప్పే ధైర్యం లేదా? కేసీఆర్ అంటే […]

విధాత,తెనాలి:ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్యలు చూస్తుంటే నేను కొట్టిన్నట్లుండాలి, నువ్వు ఏడ్చినట్లుండాలి, ప్రజలు మనల్ని నమ్మాలి, చివరకు రాజకీయ లబ్ది చేకూరాలి అన్న చందంగా ఉందన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.
తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా ఏపీ మంత్రులకు మాత్రం నోరు మెదపలేకపోతున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టానుసారంగా నోరేసుకొని పడే అధికారపక్షం మంత్రులు, ఎమ్మెల్యేలకు పక్క రాష్ట్ర మంత్రులకు సమాధానం చెప్పే ధైర్యం లేదా? కేసీఆర్ అంటే భయమా? లేక హైదరాబద్ లో మీ ఆస్తులు పోతాయన్న భయమా? ప్రజలకు చెప్పాలి.
బూటకపపు జలవివాదంతో రాజకీయ లబ్ది కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరాటపడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకు జలవివాదాన్ని తెరమీదకు తెచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం విరుచుపడదామంటే అక్కడ మన వాళ్లు ఉన్నారు కాబట్టి ఏమనలేకపోతున్నామని ముఖ్యమంత్రి ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతూ రాష్ట్రం పరువును నిలువునా తీస్తున్నారు.
జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రాజెక్టు పూర్తైతే మన రాష్ట్రం ఎడారే అని జలదీక్ష చేసినప్పుడు తెలంగాణలో మన వాళ్లు గుర్తుకురాలేదా?
అధికారంలోకి వచ్చిన తరువాత అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. 2015లో సాగర్ పై ఏపీ, తెలంగాణ పోలీసులు ఘర్షణకు దిగితే అప్పుడు జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అప్పుడు మన వాళ్లు గుర్తుకు రాలేదా?
నీటి లభ్యత కోసం కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో గొడవకు దిగినప్పుడు బెంగళూరు, పూనే, ముంబాయిలలో మన వాళ్లు లేరా? హైదరాబాద్ లో జగన్ రెడ్డి ఆస్తులను కాపాడుకోవటానికి, స్వప్రయోజనాల కోసం కేసీఆర్ దగ్గర ఏపీ నీటి హక్కులను బలిపెడుతున్నారు.
ఏపీ హక్కులకు భంగం కలిగించనని కేసీఆర్ జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో మాట్లాడారు.నేడు అదే విషయాన్ని జగన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా 8 ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే ఏపీ ప్రభుత్వం కనీసం పల్లెత్తు మాటైన అనే సహనం చేయలేకపోవడం సిగ్గుచేటు. ఉత్తుత్తి లేఖలతో కాలం వెల్లబుచ్చుతున్నారన్నారు.