Chandrababu Naidu| శాంతిభద్రతలు ఉన్న చోటికే పెట్టుబడులు : ఏపీ సీఎం చంద్రబాబు

శాంతిభద్రతలు ఉన్న చోటికే పెట్టుబడిదారులు వస్తారని..అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు పెట్టేవారు తమ పెట్టుబడులకు రక్షణ కోరుకుంటారు అని,పెట్టుబడులు పెడితే ఇబ్బంది ఉండదన్న నమ్మకం ఉంది కాబట్టే గూగుల్ సంస్థ వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు

Chandrababu Naidu| శాంతిభద్రతలు ఉన్న చోటికే పెట్టుబడులు : ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి : శాంతిభద్రతలు ఉన్న చోటికే పెట్టుబడిదారులు(Investers) వస్తారని..అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటానని ఏపీ(AP) సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) అన్నారు. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు అని, పెట్టుబడులు పెట్టేవారు తమ పెట్టుబడులకు రక్షణ కోరుకుంటారు అని,పెట్టుబడులు పెడితే ఇబ్బంది ఉండదన్న నమ్మకం ఉంది కాబట్టే గూగుల్ సంస్థ వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. 15 బిలియన్ డాలర్ల అతిపెద్ద పెట్టుబడితో ఏఐ డేటా విశాఖకు వచ్చిందన్నారు. మంగళగిరి 6వ బెటాలియన్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించి మాట్లాడారు. ఈ సంవత్సరం విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని, వీరికి నివాళులు అర్పిస్తున్నానని, ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుందన్నారు. పోలీసులు చేసేది కేవలం ఉద్యోగం కాదు.. నిస్వార్థ సేవ అన్నారు. ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్ అని, ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం ను అణిచివేయడంలో మీరు ఎంతో పేరు తెచ్చుకున్నారని అభినందించారు.

మారిన నేరాల తీరుకు అనుగుణంగా పోలీస్ శాఖ ఆధునీకరణ

నేరాల తీరు మారుతోంది క్రిమినల్స్ అప్ డేట్ అవుతున్నారని, వారి ఆటకట్టించాలంటే మీరు మరింత అప్ డేటెడ్ వెర్షన్ తో ఉండాలని చంద్రబాబు సూచించారు. అందుకే సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నాం అని, సీసీ టీవీ కెమేరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నళ్లు, గూగుల్ టేకవుట్లు… ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ క్రైమ్ కేసుల చేధనలో ఆధునీకరణ జోడించాలన్నారు. ఇప్పటికే డ్రోన్లతో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు.. స్మగ్లింగ్‌ను అరికడుతున్నారు అని, అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్ర చందనం దొంగలను కట్టడి చేస్తున్నారన్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో, జీడీ నెల్లూరు అంబేద్కర్ విగ్రహం కేసులో సీసీ కెమెరాలతో వాస్తవాలు బయటపెట్టగలిగారని అభినందించారు. మద్యం విషయంలోనూ ఇదే తరహా కుట్రలు పన్నుతున్నారని.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా అనేది పోలీసులకు అతి పెద్ద ఛాలెంజ్ గా మారిందని, ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు.. వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని, సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టుల విషయంలో చాలా మంది కుమిలిపోతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. శాంతి భద్రతలకంటే ఏదీ ముఖ్యం కాదు అన్నారు. ఆడబిడ్డలపై అరాచకం చేస్తే.. అదే చివరి రోజు అనిపించేలా పోలీసులు కఠినంగా ఉండాలని, ప్రజలకు పోలీసులు అండగా ఉండాలి.. ప్రభుత్వం పోలీసులకు అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.