Tirumala Laddu Sales : తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాల్లో సరికొత్త రికార్డు
తిరుమలలో 2025లో లడ్డూల విక్రయాల్లో రికార్డు! టీటీడీ ప్రకారం మొత్తం 13.52 కోట్ల లడ్డూల విక్రయాలతో భక్తుల ఆదరణకు కొత్త చరిత్ర సృష్టించింది.
విధాత : భక్తుల సంఖ్య..ఆదాయంలోనే కాదండోయ్…లడ్డూల విక్రయాలలోనూ తిరుమల శ్రీవారి దేవస్థానం టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2025 లో ఏకంగా 13.52 కోట్ల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లుగా టీటీడీ వెల్లడించింది. గతేడాదితో పోల్చితే విక్రయాలు 10% పెరిగాయని టీటీడీ అధికారుల వెల్లడించారు. గత ఏడాది లడ్డూ విక్రయాలు 12 కోట్ల 15 లక్షలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది 1కోటి 37 లక్షల లడ్డూల విక్రయాలు అదనంగా నమోదయ్యాయి. తిరుమలలో పది సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా 2025 డిసెంబర్ 27వ తేదీ అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక విక్రయం. నెయ్యిలో నాణ్యత మెరుగుపరచడం, పరిశుభ్రత వంటి కారణాలు లడ్డూ విక్రయాలు పెరగడానికి దోహదం చేశాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో రోజుకు 3 నుంచి 3.5 లక్షల లడ్డూలు తయారు చేసేవారు. గత సంవత్సరం నుంచి లడ్డూల తయారీ పెంచారు. రోజూ 4 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుంచి 10 లక్షల లడ్డూల వరకు నిలువ ఉంచి యాత్రికులకు విక్రయిస్తున్నారు. 700 మంది అర్చకులు నిరంతరం శ్రమిస్తూ.. నాణ్యత, రుచి పెంచడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి రోజూ 65 వేల నుంచి 75 వేల మంది వరకు వస్తుంటారు. వారాంతపు సెలవుల్లో ఆ సంఖ్య 90 వేలకు కూడా చేరుతుంది. డిసెంబర్ 28వ తేదీ ఆదివారం 91,147 వేల మందికి యాత్రికులు శ్రీవారిని దర్శించుకోవడం ఓ రికార్డు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాల తయారీ, అన్నప్రసాదాల్లో నాణ్యతలో మార్పు రావడం సానుకూల పరిణామంగా భక్తులు భావిస్తున్నారు. తిరుమలకు వచ్చిన యాత్రికులకు మంచి దర్శనం కల్పించడంలో పారదర్శక విధానాల వల్లే ఇది సాధ్యమైంది అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు. తిరుమల తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదాల్లో కూడా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Nampally Exhibition : నుమాయిష్ ప్రారంభం..46రోజుల పాటు ప్రదర్శన
Tobacco Products GST hike| న్యూఇయర్ లో సిగరేట్, పాన్ మసాల ప్రియులకు కేంద్రం షాక్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram