DGCA New Rules | ఇండిగో దెబ్బతో కళ్లు తెరిచిన డీజీసీఏ.. విమానాల రద్ధుపై కొత్త నిబంధనలు
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ గత డిసెంబర్ నెలలో 4,500 విమాన సర్వీసులను ఉన్నపళంగా రద్దు చేసింది. ఈ ఘటనలతో దేశవ్యాప్తంగా విమానయాన రంగంపై ఉన్న నమ్మకాలు పటాపంచలు అయ్యాయి. ప్రైవేటు ఎయిర్‌లైన్స్ కంపెనీలపై కేంద్రానికి నియంత్రణ, భయం లేదనేది స్పష్టమైంది.
- ట్రావెల్ ఏజెంట్లు, యాప్‌ల ఆగడాలకు కళ్లెం
- మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఇవ్వాల్సిందే
DGCA New Rules | గతేడాది ఇండిగో విమానాల రద్ధుతో లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో తిండి తిప్పలు లేకుండా, పగలు రాత్రి తేడా లేకుండా పడిగాపులు కాసి అష్టకష్టాలు పడిన విషయం తెలిసిందే. చెప్పిన సమయం ప్రకారం విమానం బయలు దేరుతుందా లేదా తెలియదు. ఒక వేళ బయలుదేరినా ఎప్పుడు అనేది అంతకూ తెలియదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో టికెట్ బుక్ చేసుకున్న లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాలకు కూడా చేరుకోలేకపోయారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వాకం, నిర్లక్ష్యం మూలంగా పిల్లా పాపలతో విమానాశ్రయాల్లో గడపాల్సిన దుస్థితి కేంద్ర పౌర విమానయాన శాఖ తీసుకువచ్చిందనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఈ ఘటన తరువాత కేంద్రంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు కనువిప్పు కలిగింది. భవిష్యత్తులో ఇలాంటి దారుణ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలకు దిగింది. తాము జారీ చేసిన నిబంధనలపై ప్రతి విమానయాన సంస్థ ట్రావెల్ ఏజెంట్లు, యాప్‌లు, ఆన్‌లైన్ బుకింగ్ సంస్థలతో అగ్రిమెంట్ చేసుకుని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని డీజీసీఏ స్పష్టం చేసింది.
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ గత డిసెంబర్ నెలలో 4,500 విమాన సర్వీసులను ఉన్నపళంగా రద్దు చేసింది. ఈ ఘటనలతో దేశవ్యాప్తంగా విమానయాన రంగంపై ఉన్న నమ్మకాలు పటాపంచలు అయ్యాయి. ప్రైవేటు ఎయిర్‌లైన్స్ కంపెనీలపై కేంద్రానికి నియంత్రణ, భయం లేదనేది స్పష్టమైంది. పైలట్ విధుల నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకురావడంతో పాటు యాజమాన్య వైఫల్యం కారణంగా ఈ ఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ యాప్‌లు, ఎయిర్‌లైన్స్ యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతున్నది కూడా. కొందరైతే రెండు మూడు వారాల ముందే అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం బుకింగ్ చేసుకున్న వారికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వేల విమానాలను రద్దు చేసింది. ఎప్పటిలాగే తమ విమానం నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి వస్తుందనే గట్టి నమ్మకంతో ఎయిర్‌పోర్టులకు చేరుకున్న ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎయిర్‌పోర్టులకు వెళ్లిన తరువాత తొలుత ఆలస్యం అని, ఆ తరువాత రద్ధు అని ఇండిగో ప్రతినిధులు ప్రకటనలు చేయడంతో పిల్లా పాపలతో వెళ్లిన వారు, ఓల్డేజ్ పర్సన్స్ నిద్రలేని రాత్రులు గడిపారు.
ఈ ఘటనపై సుమారు 26,999 మంది ప్రయాణికులు డీజీసీఏ, కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖలకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపించారు. ఫిర్యాదులను పరిశీలించగా అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండిగో సంస్థ విమానాలను అకస్మాత్తుగా రద్ధు చేయడం, ఆలస్యంగా నడపడం మూలంగా 9.82 లక్షల మంది ప్రయాణికులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోయారు. విమానాలు రద్ధు అయినట్లు ముందస్తుగా సమాచారం ఇవ్వడంలో ఇండిగో విఫలమైనట్లు డీజీసీఏ చెబుతోంది. విమానాశ్రయాలకు తమ లగేజీతో చేరుకుని, చెక్ ఇన్ అయిన తరువాత రద్దు అయినట్లు సమాచారం ఇచ్చాయి. ఏయిర్ లైన్స్ రికార్డులలో ప్రయాణీకులకు సంబంధించి మొబైల్ నెంబర్లు, ఈ మెయిల్ లేకపోవడం మూలంగా సమాచారం ఇవ్వలేకపోయామని ఇండిగో తొండి వాదనలు చేస్తోంది. గమ్యస్థానాలకు చేరుకోకపోవడం మూలంగా విలువైన సమయాన్ని కూడా కోల్పోయారు. వీరందరికీ ఇండిగో ఏయిర్ లైన్స్ రూ.22.7 కోట్ల టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేసింది. కొద్ది మందికి మాత్రమే ప్రత్యామ్నాయ విమానాలకు సమకూర్చింది. విమానాలను నడపడంలో విఫలమైన సంస్థ యాజమాన్యం లక్షలాది మంది కి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉండగా ఒక్కరికి కూడా ఇప్పటి వరకు నయాపైస చెల్లించలేదు. దీనిపై కొందరు హైకోర్టులలో కేసులు కూడా వేయగా, మరికొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. పిటీషన్లను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, వివరాలు ఇవ్వాల్సిందిగా ఇండిగో ఏయిర్ లైన్స్ తో పాటు డీజీసీసీఏ ను ఆదేశిస్తూ, విచారణను ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసింది.
ఈ అంశాలను, విపత్కర పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ తప్పులు సరిదిద్దే పని మొదలు పెట్టింది. ఇలాంటి ఘటనలు జరిగి దేశం మొత్తం గగ్గోలు పెడితే తప్ప ప్రభుత్వ వ్యవస్థలు మేల్కోవు. దేశంలోని విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెంట్లు, ఆన్ లైన్ టికెట్ యాప్ లు, టికెట్ బుకింగ్ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ప్రయాణికుడి వివరాలను సంబంధిత విమానయాన సంస్థలకు కచ్చితంగా అందచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రావెల్ ఏజెంట్లు, బుకింగ్ కంపెనీలలు తమ మొబైల్ నెంబర్లు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ప్రయాణికుల మొబైల్ నంబర్, ఈ మెయిల్ వంటి వివరాలను ఇవ్వకపోవడం మూలంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎప్పటికప్పుడు సమాచారం పంపించలేకపోయిందని డీజీసీఏ విచారణలో వెల్లడైంది. విమానయాన సంస్థలు ట్రావెల్ బుకింగ్ ఏజెంట్లు, ఆన్ లైన్ బుకింగ్ సంస్థలు, యాప్ యజమానులతో సమావేశాలు నిర్వహించి ప్రతి ప్రయాణీకుడి వివరాలు తమకు ఇచ్చే విధంగా అప్రమత్తం చేయాలని డీజీసీఏ ఆదేశించింది. డీజీసీఏ ఆదేశాలు అమలు చేస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించింది. ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లు, బుకింగ్ ఏజెంట్లు, యాప్ లతో అగ్రిమెంటు కూడా కుదుర్చుకోవాలని విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram