IndiGo Crisis | ఇండిగో ఒత్తిడికే DGCA వెనక్కి తగ్గిందా? కొత్త భద్రతానియమాల ఉపసంహరణపై వివాదం

ఇండిగో ఫ్లైట్ రద్దులు దేశ విమాన రవాణాను కుదిపేశాయి. DGCA కీలక FDTL నిబంధన వెనక్కి తీసుకోవడంతో ‘ఇండిగో ఒత్తిడి పనిచేసిందా?’ అనే ప్రశ్న బలపడుతోంది. రద్దులు, పైలట్ కొరతలతో దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో కల్లోలం. ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

IndiGo Crisis | ఇండిగో ఒత్తిడికే DGCA వెనక్కి తగ్గిందా? కొత్త భద్రతానియమాల ఉపసంహరణపై వివాదం

Did IndiGo Blackmail the Indian Government? Inside the FDTL Rollback, Safety Concerns & Passenger Fallout

  • వెల్లువెత్తిన సోషల్ మీడియా ఆగ్రహం
  • ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్నారు
  • నియమాల ఉపసంహరణ : యాదృచ్ఛికమా? ఒత్తిడా?
  • ఇండిగోను నిషేధించాలి : ప్రజల ఆగ్రహావేశాలు

(విధాత నేషనల్​ డెస్క్​)

IndiGo Crisis | ఇండియాకు చుక్కలు చూపించిన ఇండిగో ఎయిర్​లైన్స్​ దెబ్బకు 5 రోజులనుండి రోజుకు వందల సంఖ్యలో విమానాలు రద్దవ్వడంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో రాత్రిళ్లు వేలాది మంది ప్రయాణికులు ఇరుక్కుపోయారు. అష్టకష్టాలు పడుతున్నారు. ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రభుత్వం దీనిపై సీరియస్​గా ఉందని మంత్రి చెబుతున్నారు. దేశీయ సర్వీసులు అత్యధికంగా రద్దవ్వగా, అంతర్జాతీయ సర్వీసులు మాత్రం పెద్దగా దెబ్బతినకపోవడం గమనార్హం.

Passengers stranded at Indian airports amid massive IndiGo cancellations

కాగా, ఇదే సమయంలో DGCA(Directorate General of Civil Aviation) పైలట్ల వారాంత విశ్రాంతి నిబంధనను ఒక్కసారిగా ఉపసంహరించుకోవడంతో సోషల్ మీడియా మండిపడింది. దీన్ని బ్లాక్​మెయిల్​గా అభివర్ణిస్తూ, ప్రభుత్వాన్ని ఇండిగో బలవంతం చేసిందని తీవ్రమైన ఆరోపణలు ట్వీట్లు, పోస్టుల రూపంలో వెల్లువెత్తాయి. ఈ విషయంపై పైలట్ల సంఘం కూడా ఇండిగోను తీవ్రంగా అక్షేపించింది.

ALSO READ: ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!

ఈ సంక్షోభం సాధారణ షెడ్యూలింగ్ సమస్య కాదని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. IndiGo కి 18 నెలల ముందే కొత్త FDTL(Flight Duty Time Limitations) విశ్రాంతి నిబంధనలు వర్తించబోతున్నట్లు సమాచారం ఉన్నా, తగినట్లుగా సిబ్బందిని నియమించకపోవడం, షెడ్యూల్ విస్తరణ యథావిధిగా కొనసాగించడం, చివర్లో దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించడం—ఇది పూర్తిగా ఓ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసిన చర్యలా ఉందని విమర్శకులు అంటున్నారు. ప్రయాణికుల అసహనం పెరిగినంత మేరకు ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో DGCA రాత్రికి రాత్రే వివాదాస్పద నిబంధనను వెనక్కి తీసుకోవడం ఆరోపణలకు మరింత ఊతమిచ్చింది.

DGCA meeting with Aviation minister Rammohan Naidu on IndiGo crisis

ఈ మొత్తం చర్యలో తీవ్రంగా నష్టపోయినవారు, బాధపడ్డవారు మాత్రం నిరపరాధ ప్రయాణికులే. ఫ్లైట్ రద్దులు, అర్ధరాత్రి విమానాశ్రయాల్లో గందరగోళం, ఎక్కడికీ చేరలేకపోయిన ప్రజలు, తిండి, నిద్ర లేకపోవడం, ఇవన్నీ ఒక పెద్ద ఎయిర్‌లైన్ తన వ్యవస్థను తిరిగి తనకిష్టం వచ్చిన రీతిలో నిర్వచించుకోవడానికి ప్రదర్శించిన రాజకీయమని నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇండిగో ఈ వ్యవహారంలో అన్ని లక్ష్మణరేఖలు దాటేసిందని, ప్రజల ప్రాణాల కన్నా, డబ్బులే ముఖ్యమని భావించిందని సోషల్ మీడియా తీవ్రంగా విమర్శించింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇండిగోను క్షమించడానికి వీల్లేదని మేధావివర్గాలు కేంద్రానికి విన్నవించారు.

ప్రపంచ భద్రతాప్రమాణాల దిశగా కదిలిన భారత్, వెనకడుగు ఎందుకు వేసినట్లు?

పైలట్ అలసట ప్రపంచ విమానాయాన రంగంలో అత్యంత ప్రమాదకరమైన భద్రతా సమస్యగా పరిగణించబడుతుంది. ICAO, EASA, FAA వంటి అంతర్జాతీయ సంస్థలు, విశ్రాంతి అంటే కేవలం విశ్రాంతి —దానిని ఎలాంటి సెలవుతోనూ మార్చరాదని స్పష్టంగా తమ నిబంధనలలో పేర్కొన్నాయి. యూరప్‌లో వరుసగా రెండు రాత్రి ఫ్లైట్లు నిషేధం. అమెరికాలో పైలట్లకు కనీసం 10 గంటల విశ్రాంతి తప్పనిసరి, అందులో 8 గంటలు నిద్ర అవకాశం ఉండాలి. ఒకే ఎయిర్‌లైన్ ఒత్తిడికి గురయ్యే అవకాశమే లేదు. భద్రత రాజీకి గురైనట్లు తెలిస్తే భారీ జరిమానాలు విధించడం అక్కడ సాధారణం.

ఇండిగో ఒత్తిడే నిబంధనల ఉపసంహరణకు కారణమా?

ఇలాంటి సందర్భంలో భారతదేశం ప్రవేశపెట్టిన కొత్త FDTL నిబంధనలు కూడా ఈ అంతర్జాతీయ ప్రమాణాల దిశగా అడుగువేసాయి. పైలట్ల వారాంత విశ్రాంతి 48 గంటలు ఉండాలని, రాత్రి పనివేళలను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం భద్రతా కోణంలో అత్యవసరం. కానీ సంక్షోభం మొదలైన క్షణం DGCA ఆ నిబంధనలో అత్యంత కీలకమైన భాగాన్ని ఉపసంహరించుకోవడంతో “ప్రయాణికుల ప్రయోజనం కోసమా”? లేక “ఎయిర్‌లైన్ ఒత్తిడి వల్లా”? అనే ప్రశ్నదేశమంతా వ్యక్తమైంది. అలసిపోయిన పైలట్‌ చేతిలో విమానం అంటే వందలాది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే అని నిపుణుల హెచ్చరిక స్పష్టంగా ఉంది. ఒక ఎయిర్‌లైన్ తన దైనిక కార్యాచరణలో వచ్చిన లోటును నింపేందుకు విశ్రాంతి నిబంధనలను సడలించడమంటే ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటమాడటమే. ప్రపంచ ప్రమాణాలు కఠినతరం అవుతున్నప్పుడు, భారత్ మాత్రం వెనక్కితగ్గడం ఆందోళనకరం. ఇది తాత్కాలికమే అయితే పరవాలేదు. కానీ ఒక్క విమానయాన సంస్థ కోసం మొత్తం వ్యవస్థ భద్రతనే ప్రమాదంలో పడేయడం మాత్రం క్షమించరాని నేరం.

ALSO READ: ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు

అదే సమయంలో, ఈ సంక్షోభం భారత విమానయాన వ్యవస్థలో మరొక బలహీనతను బట్టబయలు చేసింది. విమానయాన రంగంలో ఒక సంస్థ ఏకఛత్రాధిపత్యం(Monopoly) వల్ల ఏర్పడిన అత్యయిక పరిస్థితి ఇది. దీన్ని వెంటనే నియంత్రించకపోతే మున్ముందు పెను ప్రమాదాలను ఎదుర్కోవాల్సివస్తుందని విమానయాన రంగ నిపుణులు హెచ్చరించారు.

Pilot fatigue rules comparison showing global rest standards

ప్రస్తుతం ప్రజల మది లో ఒకే భావన పెరుగుతోంది—ప్రయాణికుల భద్రతను పక్కన పెట్టి, ఒక విమానయాన సంస్థ వ్యూహాత్మక ఒత్తిడికి ప్రభుత్వ నిర్ణయాలు మారితే, భవిష్యత్తులో ఆకాశంలో ప్రయాణీకుల భద్రత పరిస్థితేంటి? దీనికి సమాధానం ఒకటే: IndiGo వెంటనే భారీ స్థాయిలో సిబ్బందిని నియమించాలి. DGCA స్వతంత్ర ఆడిట్ నిర్వహించి, భద్రత ప్రమాణాలు బలపడేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఏ విమానయాన సంస్థకైనా ఆకాశం సొంతం కాదు—ప్రయాణికుల ప్రాణాలు మాత్రమే ముఖ్యం.