YSRCP | రైతుల సమస్యలపై కూటమి నిర్లక్ష్యం .. మాజీ సీఎం జగన్.. పొదిలి పొగాకు బోర్డు సందర్శన

YSRCP | రైతుల సమస్యలపై కూటమి నిర్లక్ష్యం .. మాజీ సీఎం జగన్.. పొదిలి పొగాకు బోర్డు సందర్శన

YSRCP | రాష్ట్రంలో రైతుల సమస్యల పట్ల సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించి..రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. హైగ్రేడ్‌ పొగాకుకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు..పొగాకు బ్లాక్‌ బర్లీ రైతు ఎకరాకు రూ.80వేలు నష్టపోతున్నాడని ఆరోపించారు. 2023-24లో కేజీ పొగాకు రూ.366కి అమ్ముడుపోయేదని..ఇప్పుడు రూ.240 కూడా అమ్ముడుపోవడం లేదన్నారు. క్వింటా పొగాకు రూ.24 వేలు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడని.. 220 మిలియన్‌ టన్నులు ప్రొక్యూర్‌ చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిలియన్‌ టన్నులే ప్రొక్యూర్‌ చేశారని జగన్ ఆరోపించారు. వ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని.. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు.
అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రకాశం జిల్లాలో ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. మా హయాంలో ఖరీఫ్‌ సీజన్‌లోనే పెట్టుబడి సాయం అందిస్తే..చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారని.. గతేడాది రైతు భరోసా రూ.20వేలు ఎగ్గొట్టారని.. ప్రధాని మోదీ ఇచ్చినా.. చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని జగన్‌ హెచ్చరించారు.

మా హయాం.. రైతులకు స్వర్ణయుగం

మా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చామని..మా పాలన రైతులకు స్వర్ణయుగమని జగన్ చెప్పుకొచ్చారు. ప్రతి రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లమన్నారు. పారదర్శకంగా ఉచిత బీమా అందించామని.. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు)లు నిలిచాయని గుర్తు చేశారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని..మార్కెట్‌లో పోటీ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేదన్నారు. మార్కెఫెడ్ తో మేం మద్ధతు ధర కల్పించే ప్రయత్నం చేశామని..చంద్రబాబు ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారని… దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదని జగన్ ఆరోపించారు. ఈ క్రాప్‌ వ్యవస్థను నీరుగార్చారని..ఇన్‌పుట్‌ సబ్సీడీని గాలికొదిలేశారని.. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారన్నారు.