Fire Accident | పెళ్లి వేడుకలో ఎగిసిపడ్డ అగ్నికీలలు.. 100 మంది సజీవదహనం

Fire Accident | పెళ్లి వేడుక ప్రశాంతంగా కొనసాగుతోంది. నూతన వధూవరులను అతిథులందరూ ఆశీర్వదిస్తున్నారు. మరోవైపు భోజనాలు కొనసాగుతున్నాయి. అంతలోనే ఆ వేడుకలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి 100 మంది సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన ఇరాక్‌లో వెలుగు చూసింది.
ఇరాక్‌లోని హమ్దానియా అనే పట్టణంలోని ఓ మ్యారేజ్ హాల్‌లో పెళ్లి వేడుక కొనసాగుతోంది. ఉన్నట్టుండి పెళ్లి మండపంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు క్షణాల్లోనే మండపం అంతా వ్యాపించడంతో 100 మంది సజీవదహనం అయ్యారు. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. ఈ ప్రమాదంలో మరో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పలు ఆస్పత్రులకు తరలించారు.
పెళ్లి వేడుక సందర్భంగా మండపంలో పటాసులు కాల్చడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నదని పోలీసులు ప్రాథమింగా అంచనాకు వచ్చారు. ఫంక్షన్ హాల్ లోపలి వైపు పూర్తిగా చెక్క మెటీరియల్‌తో డెకరేట్ చేశారని, పటాసుల నిప్పు రవ్వలు ఎగిరి ఫర్నీచర్‌కు అంటుకోవడంతో, క్షణాల్లోనే మంటలు వ్యాపించి, భారీ ప్రాణనష్టానికి దారి తీసిందని అంచనా వేశారు.