ఆస్పత్రిలో ఇన్‌స్టా రీల్స్.. 38 మంది మెడికల్ విద్యార్థులపై చర్యలు
తాజాగా ఓ మెడికల్ కాలేజీకి చెందిన 38 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు.. ఆస్పత్రిలో ఇన్‌స్టా రీల్స్ చేసి నిబంధనలను ఉల్లంఘించారు.

బెంగళూరు : నిన్న ఓ డాక్టర్ తన ప్రీ వెడ్డింగ్ షూట్ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లో చిత్రీకరించి సస్పెండ్‌కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మెడికల్ కాలేజీకి చెందిన 38 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు.. ఆస్పత్రిలో ఇన్‌స్టా రీల్స్ చేసి నిబంధనలను ఉల్లంఘించారు. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో వెలుగు చూసింది.
గడగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చదువుతున్న 38 మంది విద్యార్థుల శిక్షణ మరో 20 రోజుల్లో ముగియనుంది. ప్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 38 మంది విద్యార్థులు ఆస్పత్రి వార్డుల్లో రీల్స్ చేశారు. ఈ రీల్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో మెడికల్ కాలేజీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. వారి శిక్షణను మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వారికి జరిమానా కూడా విధించామని తెలిపింది. ఆస్పత్రి నిబంధనలు ఉల్లంఘించడంతోనే వారిపట్ల కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆస్పత్రిలో రీల్స్ చేయడానికి అనుమతి ఇవ్వలేదని, ఇది ఆస్పత్రి నిబంధనలకు విరుద్దమన్నారు. ఇలాంటి చర్యలను తాము ప్రోత్సహించం అన్నారు. రోగులకు ఇబ్బంది కలగకుండా ఆస్పత్రి వెలుపల రీల్స్ చేసుకోవాలని సూచించారు.