దంచి కొట్టిన వార్న‌ర్.. పాకిస్తాన్‌పై స్ట‌న్నింగ్ విజ‌యం సాధించిన ఆసీస్‌

దంచి కొట్టిన వార్న‌ర్.. పాకిస్తాన్‌పై స్ట‌న్నింగ్ విజ‌యం సాధించిన ఆసీస్‌

ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భాగంగా ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌ల‌లో ఘోర ప‌రాజ‌యాలు చ‌విచూసిన విష‌యం తెలిసిందే. అప‌జ‌యం అంటే ఏమాత్రం న‌చ్చ‌ని ఆసీస్ తిరిగి గాడిలో ప‌డింది. పాకిస్తాన్‌పై ఘ‌న విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌రో అడుగు ముందుకు వేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా 368 పరుగుల భారీ లక్ష్యఛేదనని విధించింది. ఓపెనర్లు మంచి ఆరంభం అందించినా మిడిల్ ఆర్డర్‌, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో 45.3 ఓవర్లలో 305 పరుగులకి ఆలౌట్ అయిన పాకిస్తాన్, 62 పరుగుల తేడాతో ఓడింది. బ్యాటింగ్‌లో డెవిడ్ వార్నర్ దుమ్ము రేపగా.. బౌలింగ్‌లో ఆడమ్ జంపా(4/53) అద‌ర‌గొట్టాడు. గెల‌వాల్సిన మ్యాచ్‌లో మ‌రోసారి చెత్త ఫీల్డింగ్‌తో ఓట‌మి బాట ప‌ట్టాల్సి వ‌చ్చింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్(124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163), మిచెల్ మార్ష్(108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగుల భారీ స్కోర్ చేసింది . పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(5/52) ఐదు వికెట్లతో మ‌రోసారి త‌న సత్తా చాటగా.. హ్యారీస్ రౌఫ్(3/83) మూడేసి వికెట్లు , ఉసామా మీర్(1/82) ఓ వికెట్ తీసాడు. పాకిస్థాన్ చెత్త ఫీల్డింగ్ ఆసీస్ బ్యాటర్లకు కలిసి రావ‌డంతో వారు భారీ స్కోరు న‌మోదు చేశారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డేవిడ్ వార్నర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఉసామా మీర్ నేలపాలు చేయ‌డంతో వార్న‌ర్ ఇక విజృంభించాడు. సెంచరీ పూర్తి చేసిన అనంతరం అతను ఇచ్చిన మరో క్యాచ్‌ను డీప్ మిడ్ వికెట్‌లో అబ్దుల్లా షఫీక్ జార‌విడిచాడు. రెండు క్యాచ్‌లు చేజార్చిన‌ పాక్ విజయవకాశాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి.

ఇక భారీ ల‌క్ష్య చేధ‌న‌లో భాగంగా బరిలోకి దిగిన పాక్ మొద‌ట్లో బాగానే ఆడింది. అబ్దుల్లా షఫీక్(61 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), ఇమామ్ ఉల్ హక్(71 బంతుల్లో 10 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించిన కూడా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, మార్కస్ స్టోయినీస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్ తలో వికెట్ తీసారు. చివ‌రి వ‌ర‌కు పాక్ గెలుపు కోసం పోరాడిన ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇక పాక్‌కి చుక్క‌లు చూపించిన డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌ను అఫ్గానిస్థాన్‌తో ఆడనున్న విష‌యం విదిత‌మే.