Kedarnath Temple Closure : మూతపడిన కేదారనాథ్ ఆలయం

శీతాకాలం నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదారనాథ్ ఆలయ ద్వారాలను 'భాయ్ దూజ్' పండుగ సందర్భంగా శాస్త్రోక్తంగా మూసివేశారు. ఆరు నెలల పాటు కేదార్‌నాథ్ స్వామివారికి ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజలు జరుగుతాయి.

Kedarnath Temple Closure : మూతపడిన కేదారనాథ్ ఆలయం

విధాత : 12జ్యోతిర్లింగాలలో ఒకటైన ప్రసిద్ద శైవ క్షేత్రం ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ ఆలయం ద్వారాలను మూసివేశారు. శీతాకాలం నేపథ్యంలో భాయ్ దూజ్ పండగ రోజున శాస్త్రోక్తంగా ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నది. శీతాకాలం 6 నెలల పాటు కేదార్ నాథ్ ఆలయం మూసివేస్తారు. ఆలయ మూసివేత కార్యక్రమంలో 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. హరహర మహాదేవ్, జై బాబా కేదార్ నినాదాలతో కేదార్ ఘాట్ హోరెత్తింది. ఆలయాన్ని మూసివేయనున్న నేపథ్యంలో పూలతో అందంగా అలంకరించారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సైతం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత ద్వారాలను మూసివేసి.. పంచముఖి డోలి యాత్ర ఉఖీ మఠ్‌కు బయలుదేరింది.

ఇకపై ఆరునెలల పాటు ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో కేదార్ నాథ్ కు పూజలు కొనసాగుతాయి. కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేత అనంతరం బాబా కేదార్‌నాథ్ స్వామివారిని పంచముఖి ఉత్సవ డోలి యాత్రతొ ఓంకారేశ్వర్ కు తరలించారు. రాత్రికి రాంపూర్ కు పల్లకీ యాత్ర చేరుకుంటుంది. ఇప్పటికే కేదార్‌నాథ్‌లో భారీగా చలి పెరిగి మంచు కురుస్తుంది.

అటు ఇదే రోజు మధ్యాహ్నం 12:30 కి యమునోత్రి ఆలయ ఆలయ తలుపులు కూడా మూసివేశారు. యమునా మాత ఉత్సవ విగ్రహం ఖర్సాలి గ్రామంలో పూజలందుకోనుంది.