చల్లారని కోపం.. ముంబై ఇండియన్స్ జెర్సీలని తగలబెడుతున్న ఫ్యాన్స్..ట్రెండింగ్‌లో BOYCOTT MI JERSEY హ్యాష్ ట్యాగ్

మరి కొద్ది గంటలలో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో తొలి మ్యాచ్ ఆడనుండడం ఆ టీమ్‌కి ప్లస్ అవుతుంది. చిదంబరం స్టేడియంలో చెన్నైకి మంచి రికార్డ్ ఉంది. ఈ గ్రౌండ్‌లో ఆర్సీబీ చేతిలో చెన్నై ఒకే ఒక్కసారి ఓడింది. అయితే ఐపీఎల్ మరి కొద్ది గంటలలో ప్రారంభం కానున్న సమయంలో సోషల్ మీడియాలో ముంబై ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ముంబైకి ఐదు టైటిల్స్ తీసుకొచ్చిన రోహిత్‌ని తప్పిస్తూ హార్ధిక్‌ని కెప్టెన్ చేయడంపై ముంబై ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను చాలా మంది అన్‌ఫాలో చేయడం మనం చూశాం. ఇక రోహిత్‌ని తప్పించడం గురించి హార్ధిక్, కోచ్ మార్క్ బౌచర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ముంబై ఫ్రాంచైజీ ఫ్యాన్స్ కోపం చల్లారడం లేదు.
మరికొద్ది గంటల్లో ఐపీఎల్ సీజన్17కు తెరలేవనుండగా.. ముంబై అభిమానులు తమ నిరసనను మరింత పెంచారు. ముంబై ఇండియన్స్ జెర్సీలను తగలబెట్టడమే కాక BOYCOTT MI JERSEY అనే హ్యాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కు మద్దతు ఇవ్వవద్దొంటూ జెర్సీలను తగలబెడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని తట్టుకోలేకపోతున్న రోహిత్ ఫ్యాన్స్.. ఇది కుట్రలో భాగమేనంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రోహిత్ మార్పు వెనక సచిన్ హస్తం కూడా ఉందని, ఆయన కొడుక్కి అవకాశం ఇచ్చేందుకు ఇలా చేశారని అంటున్నారు.
రోహిత్ కెప్టెన్సీలో సచిన్ టెండూల్కర్ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదని, అందుకే కెప్టెన్‌ని మార్చేందుకు సచిన్ కుట్ర పన్నాడని ఆయనపై విరుచుకుపడుతున్నారు.ప్రతి సీజన్‌లో ముంబై ఇండియన్స్ మంచి విజయం సాధించాలని కోరుకునే ఫ్యాన్స్ ఇప్పుడు మాత్రం దారుణంగా ఓడిపోవాలంటూ శాపనార్థాలు పెడుతున్నారు. కెప్టెన్‌గా తనకు రోహిత్ అండదండలు తప్పక ఉంటాయని, భుజాలపై చేతులు వేసి నాకు తప్పక సహకరిస్తాడని హార్దిక్ పాండ్యా చెప్పినా.. ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మతో హార్ధిక్ నవ్వుతూ సరదాగా కనిపించినా అభిమానుల కోపం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతానికి మాత్రం సోషల్ మీడియాలో ముంబై ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. కాగా, ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది.