PV Narasimha Rao | తెలుగు బిడ్డ పీవీకి భారత రత్న పురస్కారం
మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. భారత రత్న సాధించిన తొలి తెలుగు బిడ్డగా పీ.వీ.నరసింహారావు నిలిచారు
PV Narasimha Rao | విధాత: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు భారతరత్న(Bharat Ratna) దక్కింది. పీవీతోపాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా కేంద్రం శుక్రవారం భారత అత్యున్నత పురస్కారాన్నిప్రకటించింది. ముగ్గురికి భారతరత్న పురస్కారాలు ప్రకటించడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా దేశానికి వారు అందించిన అసాధారణ సేవలను స్మరించుకున్నారు.
పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. పీవీ ఓ మేధావి అని, రాజనీతజ్ఞుడు అని తన ఎక్స్ ఖాతాలో మోదీ కీర్తించారు. “మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారు భారతరత్నతో సత్కరించబడతారని పంచుకోవడం ఆనందంగా ఉంది” అని ప్రధాని పేర్కొన్నారు.
విభిన్న హోదాల్లో నర్సింహారావు పనిచేసినట్టు తెలిపారు. మరో మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్‌కు కూడా భారతరత్న ఇచ్చి తమ ప్రభుత్వం గౌరవించిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని వెల్లడించారు. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌కు కూడా భారతరత్న ఇవ్వడం పట్ల ప్రధాని మోదీ హర్షం ప్రకటించారు.
నరసింహారావు 1991 నుంచి 1996 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. భారతదేశ ఆర్థిక సరళీకరణకు నాంది పలికిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాడిన చరణ్ సింగ్ 1979లో కొంతకాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. డాక్టర్ స్వామినాథన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవానికి రూపశిల్పిగా ఖ్యాతి గడించారు.
“విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు గారు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలందించారు. అనేక సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా చేసిన కృషికి సమానంగా గుర్తుండిపోతారు. భారతదేశాన్ని ఆర్థికంగా పురోగమింపజేయడంలో, దేశ శ్రేయస్సు, వృద్ధికి గట్టి పునాది వేయడంలో ఆయన దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది” అని ప్రధాని పేర్కొన్నారు.
“దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వ అదృష్టం. దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన తన జీవితాన్ని రైతుల హక్కులు, సంక్షేమం కోసం అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా, దేశ హోంమంత్రి అయినా.. ఎమ్మెల్యే అయినా.. ఆయన ఎప్పుడూ దేశ నిర్మాణానికి ఊతమిచ్చారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలబడ్డారు. 5వ ప్రధాన మంత్రి అయిన చరణ్ సింగ్, భారతీయ రాజకీయవేత్త మాత్రమే కాదు, స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ అహింసా పోరాటంతో జతకట్టారు. ఆయన 1980లో లోక్‌దల్ పార్టీని స్థాపించారు. “భారత రైతుల ఛాంపియన్” గా కీర్తించబడ్డారు” అని ప్రధాని మోదీ ప్రత్యేక పోస్ట్‌లో రాశారు.
డాక్టర్ స్వామినాథన్ భారతీయ వ్యవసాయానికి విశేష కృషి చేశారు. ఆయనకు “ఆర్థిక జీవావరణ శాస్త్ర పితామహుడు” అనే బిరుదు లభించింది. హరిత విప్లవం గ్లోబల్ లీడర్‌గా స్వామినాథన్ 1960లలో కరువు లాంటి పరిస్థితుల నుంచి భారతదేశాన్ని రక్షించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి రకాలను తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram