బిష్ణోయ్ దెబ్బకి ఆసీస్ విలవిల… సిరీస్‌లో మరో విజయం దక్కించుకున్న భారత్

వరల్డ్ కప్ ఓటమిని జీర్ణించుకోకముందే భారత్ ప్రస్తుతం ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఏ జట్టు మీద అయితే భారత్ ఓటమి చెంది వరల్డ్ కప్ పోగొట్టుకుందో ఇప్పుడు అదే టీమ్ మీద తమ ప్రతాపం చూపిస్తుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడగా, ఆ రెండింట్లో మంచి విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్.. భారత్‌ని ముందుగా బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. అయితే అతడి నిర్ణయం ఎంత పెద్ద తప్పో ఇన్నింగ్స్ మొదలైన నిమిషాల్లోనే తెలుసొచ్చింది. మొదట్లో కాస్త స్లోగానే ఆడిన యశస్వి జైస్వాల్ తర్వాత మాత్రం విజృంభించాడు.
ప్రతి బంతిని బౌండరీకి తరలించే పని పెట్టుకున్న యశస్వి కేవలం 25 బంతుల్లోనే 53 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (52), సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 19 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (58) కూడా చూడచక్కని షాట్లతో ప్రేక్షకులని అలరించారు. ఇక ఎప్పటి మాదిరిగానే చివరలో రింకూ సింగ్ వీరవిహారం చేశాడు. రింకూ సింగ్ (9 బంతుల్లోనే 31 నాటౌట్) ధాటిగా ఆడడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 235 పరుగులు చేసింది.ఇక ఛేజింగ్‌లో ఆసీస్‌కు అనుకున్న ఆరంభం దక్కకపోవడం మిడిల్ ఆర్డర్‌లో కూడా ఎవరు అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబరచని నేపథ్యంలో ఆసీస్ రెండో మ్యాచ్‌లోను ఓటమి పాలైంది.
రెండో మ్యాచ్‌లో ఓపెనర్ అవతారం ఎత్తిన స్టీవ్ స్మిత్ (19) ,మాథ్యూ షార్ట్ (19) మొదట్లో అంతగా పరుగులు రాబట్టలేకపోయారు. రవి బిష్ణోయ్ మూడు కీలక వికెట్స్ తీయడంతో ఆసీస్ తేరుకోలేకపోయింది. గత మ్యాచులో సెంచరీ వీరుడు జోష్ ఇంగ్లిస్ (2)ను బిష్ణోయ్ త్వరగానే పెవీలియన్ చేర్చాడు. ఇక మ్యాక్స్‌వెల్ (12) ఫెయిలవగా.. మార్కస్ స్టొయినిస్ (45), టిమ్ డేవిడ్ (37) కాసేపు ఆసీస్ అభిమానులకు ఆశలు కల్పించే ప్రయత్నం చేశారు. అయితే డేవిడ్‌ను బిష్ణోయి ఔట్ చేసి పెవీలియన్‌కి పంపాడు.ఆ తర్వాత ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ (42 నాటౌట్) కొంత పోరాడినా అప్పటికి కంగారూల ఓటమి ఖరారైపోయింది. మొత్తానికి ఐదు టీ20ల సిరీసులోభారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది