Kapil Dev | మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కిడ్నాప్..

Kapil Dev | టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. భారత్‌కు మొట్ట మొదటి వన్డే ప్రపంచ కప్ అందించిన దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ కిడ్నాప్‌కు గురైనట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఏదో మార్కెట్‌లో కపిల్ దేవ్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది.
కపిల్ రెండు చేతులు కట్టేసి, నోట్లో ఓ బట్ట ముక్క కుక్కి.. ఇద్దరు వ్యక్తులు ఆయనను బలవంతంగా లాక్కెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో కపిల్ ఒకసారి వెనక్కి తిరిగి చూసిన దృశ్యం కనిపించింది. ఈ వీడియోను గౌతమ్ గంభీర్ ట్విట్టర్‌లో షేర్ చేసి, క్యాప్షన్ ఇలా ఇచ్చారు. ఈ వీడియో తనకే వచ్చిందా..? ఇంకెవరికైనా వచ్చిందా..? ఆ వీడియోలో ఉన్నది నిజమైన కపిల్ దేవ్ కాదనుకుంటున్నాను. నిజమైన కపిల్ దేవ్ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు గంభీర్ పేర్కొన్నారు. మొత్తానికి గంభీర్ ట్వీట్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కొందరు ఈ వీడియోను మార్ఫింగ్ చేశారని అంటుంటే, మరికొందరు మాత్రం వన్డే ప్రపంచకప్ దగ్గర పడుతుండడంతో అందుకు సంబంధించిన ప్రకటనై ఉండొచ్చునని అంటున్నారు. ఇదిలా ఉంటే.. కపిల్‌దేవ్ రెండు రోజు క్రితం వారణాసిలో కనిపించిన విషయం విదితమే. ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌లతో కలిసి అతి పెద్ద స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో కపిల్ దేవ్ పాల్గొన్నారు.
Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev