వైట్ బాల్ క్రికెట్‌కి విరాట్ కోహ్లీ దూరం..కేవ‌లం టెస్ట్‌లు మాత్ర‌మే ఆడ‌తాడా..!

వైట్ బాల్ క్రికెట్‌కి విరాట్ కోహ్లీ దూరం..కేవ‌లం టెస్ట్‌లు మాత్ర‌మే ఆడ‌తాడా..!

ప్ర‌పంచ క్రికెట్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్స్‌ల‌లో ఒక‌రిగా విరాట్ కోహ్లీని చెప్పుకోవ‌చ్చు. ఇటీవ‌ల ముగిసిన ప్రపంచ క‌ప్‌లో బ్యాట్‌తో వీరవిహారం చేసిన విరాట్ కోహ్లీ త్వ‌ర‌లో రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మి త‌ర్వాత కోహ్లీ సైతం మ్యాచ్‌లు ఆడేందుకు అంత‌గా ఆస‌క్తి లేడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో కోహ్లీ సౌతాఫ్రికాతో వైట్‌‌బాల్ సిరీస్‌కు దూరం కానున్నాడు. సిరీస్ నుంచి తాను బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెబుతూ బీసీసీఐకి తెలియజేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. డిసెంబరు 10 నుంచి భారత్-సౌతాఫ్రికా మధ్య వన్డే, టీ20 సిరీస్ ప్రారంభం కానుండ‌గా, ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కూడా అక్క‌డే జ‌ర‌గ‌నుంది.

అయితే గత కొంతకాలంగా నాన్‌స్టాప్‌గా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉండ‌గా, ఆయ‌న కొన్ని రోజుల పాటు విశ్రాంతి కోరిన‌ట్టు తెలుస్తుంది. వైట్‌బాల్ సిరీస్‌ నుంచి బ్రేక్ కోరిన కోహ్లీ, టెస్టు సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉంటాన‌ని చెప్పిన‌ట్టు తెలుస్తుంది. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ త్వరలోనే సౌతాఫ్రికాలో పర్యటించే బారత జట్టును ఎంపిక చేయనుంది. ఇక భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా ఇదే నిర్ణ‌యం తీసుకుంటాడా లేదంటే సౌతాఫ్రికా టూర్ కి వెళ‌తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా, రోహిత్ శర్మ ప్ర‌స్తుతం రెస్ట్‌లో ఉండ‌గా, ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడు. అయితే సౌతాఫ్రికాలో జ‌రిగే వైట్‌బాల్ సిరీస్‌కు అత‌ను అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఇండియాలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భార‌త్ ఒక మ్యాచ్‌లో ఓడింది. ఇక సౌతాఫ్రికా పర్యటన విష‌యానికి వ‌స్తే ఇది డిసెంబర్ 10 నుంచి ప్రారంభంకానుంది. 10 నుంచి 14 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, 17 నుంచి 21 మధ్య మూడు వన్డేల సిరీస్, 26 నుంచి జనవరి 7 మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. మ‌రి ఈ సిరీస్ కోసం ఎవ‌రెవ‌రిని ఎంపిక చేస్తారు, ఎవ‌రికి ట్రోఫీ ద‌క్క‌నుంది అనేది చూడాలి.