గుడ్ న్యూస్: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లకు లైన్ క్లియర్
డిసెంబర్‌లో విడుదల కానున్న నోటిఫికేషన్లు అదనంగా మరికొన్ని కేటగిరీలు రెండు విభాగాల్లో పెరగనున్న పోస్టులు విధాత: తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ మరో శుభవార్త చెప్పనున్నది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2, 3 నోటిఫికేషన్ల జారీకి సర్వీస్ కమిషన్ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ముఖ్య మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన 80 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించిన వాటిలో గ్రూప్ 2 కింద 663, గ్రూప్-3 కింద 1,373 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటికే అనుమతించిన వాటికి […]

- డిసెంబర్‌లో విడుదల కానున్న నోటిఫికేషన్లు
- అదనంగా మరికొన్ని కేటగిరీలు
- రెండు విభాగాల్లో పెరగనున్న పోస్టులు
విధాత: తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ మరో శుభవార్త చెప్పనున్నది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2, 3 నోటిఫికేషన్ల జారీకి సర్వీస్ కమిషన్ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ముఖ్య మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన 80 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించిన వాటిలో గ్రూప్ 2 కింద 663, గ్రూప్-3 కింద 1,373 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటికే అనుమతించిన వాటికి ఇతర విభాగాల్లో కొత్తగా గుర్తించినవి చేరనున్నాయి.
గ్రూప్స్, ఇతర సర్వీస్ ఉద్యోగాల వర్గీకరణలో భాగంగా ప్రభుత్వం గ్రూప్-2,3 కేటగిరిల్లో మరిన్ని పోస్టులను చేర్చింది. దీనికి అనుగుణంగా పోస్టుల వర్గీకరణ, పరీక్ష, ఎంపిక విధానం నిబంధనలకు సవరణలు చేస్తూ జీవో నెం. 136 జారీ చేసింది. దీంతో ఈ నోటిఫికేషన్ల జారీకి టెక్నికల్ సమస్యలు తొలిగిపోయాయి.
గ్రూప్-2 లో ప్రభుత్వం కొత్తగా అనుమతించిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు అందినట్టు, వాటి పరిశీలన పూర్తయినట్టు సమాచారం. అదనంగా చేర్చిన వాటితో కలిపి సర్వీస్ కమిషన్ డిసెంబర్ నెలలో గ్రూప్ 2,3 నోటిఫికేషన్లు జారీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. మొదట గ్రూప్-2, పది, పదిహేను రోజుల వ్యవధిలో గ్రూప్-3 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సర్వీస్ కమిషన్ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది.
గ్రూప్- 2, 3 స్థాయి కలిగిన మరిన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలా అదనంగా అనుమతి ఇచ్చిన పోస్టులకు వేరుగా పరీక్ష నిర్వహించడం కంటే తత్సమాన హోదా కలిగిన పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహాయ సంక్షేమాధికారి పోస్టులకు గతంలో వేరుగా ప్రకటనలు వచ్చేవి.
ఈ పోస్టులు తహసీల్దార్ కన్నా ఎక్కువ హోదా కలిగినవి. వీటికి ప్రత్యేక నియామకాలు చేపట్టే బదులు గ్రూప్-2 కేటగిరిలో భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. గ్రూప్-2 కేటగిరిలో ఎక్కువ హోదా కలిగిన ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు ఇప్పటికే రోస్టర్ వారీగా ప్రతిపాదనలు రూపొందించి టీఎస్‌పీఎస్సీకి అందించాయి. అలాగే ప్రభుత్వ విభాగాల్లో ఏఎస్‌వో పోస్టులు పెరగనున్నాయి.
గ్రూప్-3లో ప్రస్తుతం ఎనిమిది కేటగిరీల ఉద్యోగాలున్నాయి. కొత్తగా మరో రెండు సర్వీసులను ప్రభుత్వం చేర్చింది. దీంతో వీటి సంఖ్య పదికి చేరింది. కొత్తగా అకౌంటెంట్ (గిరిజన సంక్షేమ సేవలు), ఇతర విభాగాధిపతుల కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్‌తో పాటు వీటి తత్సమాన కేటగిరీ ఉద్యోగాలు గ్రూప్-3 పరిధిలో ఉంటాయి.