200 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి మలయాళ చిత్రం
మంజుమ్మెల్ బాయ్స్(Manjummel Boys) - మలయాళ చిత్రసీమలో తొలిసారి 200 కోట్లు వసూలు చేసిన చిత్రంగా సంచలనం సృష్టించింది.

మంజుమ్మెల్ బాయ్స్(Manjummel Boys) – మలయాళ చిత్రసీమలో తొలిసారి 200 కోట్లు వసూలు చేసిన చిత్రంగా సంచలనం సృష్టించింది.
నిజజీవిత కథగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్(Survival Thriller) సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ఆఫీస్ దుమ్ము దులుపుతూ, సంచలన ప్రదర్శన చేస్తోందనీ, మొత్తంగా 200 కోట్ల కలెక్షన్లను దాటేసిందని ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ(FEUOK) తెలిపింది. ఊహించని విధంగా ఈ సినిమా తమిళనాడులో విపరీతమైన కలెక్షన్లను సాధించింది. దాదాపు 50 కోట్లు కేవలం తమిళనాడు నుంచే వచ్చాయి. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2018లో వచ్చిన కేరళ వరద బీభత్సంపై తీసిన చిత్రం ‘2018’ ని దాటేసింది. ఇప్పటిదాకా 2018 సినిమానే 150కోట్లకు పైగా వసూలు చేసి, మలయాళంలో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. దాన్ని ఇప్పుడు ‘మంజుమ్మెల్ బాయ్స్’ వెనక్కినెట్టి రికార్డులు బద్దలు కొట్టింది.
అంతకుముందు మోహన్‌లాల్ నటించిన పులిమురుగన్(Pulimurugan) మొదటిసారిగా 100 కోట్లు కొల్లగొట్టిన మలయాళ చిత్రంగా నిలిచింది. విచిత్రంగా పాన్ఇండియా సినిమాలుగా ప్రచారం చేసుకున్న చాలా మలయాళ సినిమాలు వసూళ్లలో అంత పనితనం చూపించలేకపోయాయి. FEUOK అధ్యక్షుడు విజయ్‌కుమార్ మాటలను బట్టి, మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు (Premalu)వంటి చిత్రాలలో అన్ని రకాల ప్రేక్షకులను, ఇతర రాష్ట్రాలవారినీ ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ, ఊహించనివిధంగా విజయం సాధించడానికి గల సూత్రమైతే కనిపించడంలేదు. కానీ, కేరళ వెలుపల కూడా విజయం సాధించగల కథలతో ముందుకువెళితే బహుశా ఈ మార్కెట్‌పై ప్రభావం చూపించగలమేమోనని ఆయన అభిప్రాయం. కేవలం కేరళలోనే 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మంజుమ్మెల్ బాయ్స్, ప్రపంచవ్యాప్తంగా చాలా రికార్డులను బ్రేక్ చేసింది.

తమిళంలో ఈ చిత్రం విజయం సాధించడానికి గల కారణాల్లో కమలహాసన్ ‘గుణ’ చిత్రానికి నివాళిగా దాన్లోని హిట్ పాట ‘కన్మణి అన్బోడు కథలన్’ ( తెలుగులో ‘కమ్మనీ ప్రేమలేఖ రాసింది హృదయమే..’) ను ఇందులో పెట్టడం కూడా. ఇళయరాజా సంగీతంలో ఒక ఆణిముత్యం ఈ పాట. కానీ, స్నేహం తాలూకు గొప్పతనం చూపించిన విధానం కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అలాగే తమిళంతో పెద్ద హీరోల సినిమాలేవి లేని టైమ్‌లో విడుదల కావడం కూడా దీనికి కలిసొచ్చిందని చెప్పొచ్చు.
ఈ ఏడాది మొదట్లో ఎ.డి.గిరీశ్ తీసిన ‘ప్రేమలు’ చిత్రం కూడా బ్రహ్మాండంగా నడిచింది.109 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఒక్క కేరళలోనే 60 కోట్లు కలెక్ట్ చేసింది. దీని తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బాగా నడుస్తోంది. దాంతో ఈ సంవత్సరం మలయాళ పరిశ్రమలో విజయాలు కూడా మొదలయ్యాయి. మమ్ముట్టి నటించిన భ్రమయుగం(Bramayugam) కూడా విజయవంతమైంది. ఇది 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొత్తానికి 2024 మలయాళ చిత్రసీమకు కలిసొచ్చిన ఏడాదిగా చెప్పుకోవచ్చు.